వై ఏపీ నీడ్స్ జగన్ (ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే) అనే కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో ప్రజాదరణ పొంది తిరిగి అధికారాన్ని దక్కించుకోడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాచరణ ప్రకటించారు. ఈ పరంపరలో సామాజిక సాధికారత బస్సుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
ఏపీకి మరోసారి జగన్ పరిపాలన ఎందుకు అవసరమో వివరించడానికి వైసీపీ గడపగడపకూ వెళ్లడానికి సిద్ధమవుతుంటే, వద్దే వద్దని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా నినదిస్తున్నాయి. ప్రజాకోర్టులో ఎవరి వాదన వారిది. అంతిమంగా ప్రజాభిప్రాయమే ఫైనల్. అయితే ప్రజల మనసుల్లో ఏముందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు తమ ఇళ్లకు వచ్చి, ఏవేవో హామీలు ఇస్తారని వారికి బాగా తెలుసు. 151 సీట్లతో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీకి, మరోసారి అధికారం వస్తుందా? రాదా? అంటే…ఎవరూ నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరిణామం విజయమా? ఓటమా? అనేది ఆ పార్టీనే తేల్చుకోవాలి.
రాజకీయ పార్టీలేవైనా ఎప్పటికీ తమకే అధికారం వుండాలని కోరుకుంటుంటాయి. అయితే ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇస్తుంటారు. తమ జీవితాల్లో వెలుగు నింపుతారనే ఆశతోనే ప్రజలు ఆదరిస్తుంటారు. ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టు పరిపాలన సాగించి వుంటే ప్రజలు ఎప్పటికీ తిరస్కరించరు. ప్రజలు మొట్టమొదట తమకు మేలు కంటే కీడు చేయకూడదని పాలకుల నుంచి కోరుకుంటుంటారు. ఆ తర్వాత ప్రశాంతంగా జీవనం సాగించే పరిస్థితుల్ని నెలకొల్పే పాలకుడై వుండాలని ఆశిస్తారు.
పరిపాలన అంటే ఒక యుద్ధంలా కాకుండా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. ఫలానా నాయకుడు అధికారంలో వుంటే, నిత్యం ఘర్షణ వాతావరణం వుంటుందనే భావన మనసుల్లోకి వస్తే మాత్రం ఎన్నికల్లో తిరస్కరిస్తారు. అంతేకాదు, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినప్పటికీ, కృతజ్ఞత విషయానికి వస్తే ప్రజల మనసుల్ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఏ మనిషైతే తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు, అలాంటి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఊపిరి పోస్తే, జీవితాంతం తప్పకుండా కృతజ్ఞతతో వుంటారు.
ఉదాహరణకు వైఎస్సార్ హయాంలో రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజురీఎంబర్స్‌మెంట్, 108, 104 వాహనాలు తదితర పథకాల్లో వల్ల లబ్ధి పొందని కుటుంబాలుండవు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యమని భావించిన తరుణంలో ప్రతి రైతుకూ రుణమాఫీ మాటల్లో చెప్పలేనంత ఊరట. అలాగే ఉచిత విద్యుత్ వల్ల ఎన్నో రైతు కుటుంబాలు భారీ మొత్తంలో బిల్లుల నుంచి ఉపశమనం పొందాయి.
ఆరోగ్యశ్రీ కింద ఎన్నో వేల కుటుంబాలు ఉచితంగా గుండె ఆపరేషన్లు, ఇతరత్రా జబ్బులకు కార్పొరేట్ వైద్యాన్ని పొంది ప్రాణాలు దక్కించుకున్నాయి. ఇక 108 వాహనం గొప్పతనం గురించి సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో చెప్పి, ఆ పథకాన్ని కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన వైఎస్సార్ నిర్మించి రైతులకు పంటలతో పాటు, వారి భూములకు మంచి రేట్లు వచ్చేలా పాలన సాగించారు.
అయినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి 2009లో ప్రజలు పాస్ మార్కులు మాత్రమే వేశారు. ఇప్పుడు జగనే రాష్ట్రానికి ఎందుకు అవసరమో చెప్పడానికి వైసీపీ సైన్యం ప్రజాక్షేత్రంలోకి వెళుతోంది. ఈ కార్యక్రమం మంచిదే. అయితే జగన్ సీఎం కావాల్సిన అవసరం వైసీపీకి వుందేమో కానీ, జనాలకు కాదని ప్రతిపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. గత కొన్నేళ్లుగా చంద్రబాబు పాలనను పౌర సమాజం చూసింది. చంద్రబాబు పాలనలో చెప్పుకోతగ్గ ఏ ఒక్క పథకం అమలు కాలేదు. అయితే అభివృద్ధికి , ఐటీ రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు గురించి టీడీపీ ప్రచారం చేస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి ఎలాంటి నాయకుడు అవసరం అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే పలు దఫాలు చంద్రబాబు ప్రజా తిరస్కరణకు గురయ్యారు. మళ్లీమళ్లీ తానే ప్రత్యామ్నాయ నాయకుడిగా చంద్రబాబు ప్రజల ముందుకు రావడం గమనార్హం. జగన్ ఐదేళ్ల పాలన, అలాగే చంద్రబాబు 14 ఏళ్ల పాలన…వీరిలో ఎవరు సరైన నాయకుడో ప్రజలు తీర్పు ఇవ్వాల్సి వుంటుంది. విస్తృత ప్రజాప్రయోజనాలను నెరవేర్చే నాయకుడికే అధికారం దక్కుతుంది. టీడీపీ, వైసీపీ నాయకుల అవసరాలను తీర్చడానికి వారి అధినేతలకు జనం అధికారం కట్టబెట్టరు.
ఎవరైతే తమ ఆకాంక్షలకు తగ్గట్టు పాలన సాగిస్తారనే నమ్మకాన్ని కలిగిస్తారో, వారికే అధికారం దక్కుతుంది. తమ ప్రతీకారాలు, సంపద కోసం పాలన సాగించారనే అభిప్రాయాన్ని కలిగించినట్టైతే ఇంటికి సాగనంపడానికి ప్రజలు వెనుకాడరు. నాయకుల కోరికలు తీర్చడానికి ప్రజలేమీ అమాయకులు కారు. తమకు ఏ నాయకుడు పాలకుడైతే బాగుంటుందో ఒకటికి పదిసార్లు ఆలోచించే ఈవీఎంలో బటన్ నొక్కుతారు. నాయకులు పాలకులు కావాలంటే ప్రజల మనోభావాలకు తగ్గట్టు వ్యవహరించడం ఒక్కటే మార్గం. ఇంతకు మించి అధికారాన్ని దక్కించుకోడానికి షార్ట్ కట్ విధానాలేవీ లేవు.