తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు గడువు ముగింపు దగ్గరపడింది. ఈ నెల 3న మొదలైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగియనుంది. ఇక నామినేషన్లకు కేవలం 24 గంటల గడువు మాత్రమే వుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా పలువురు ప్రముఖులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.
గజ్వేల్‌లో ఉదయం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం హెలికాప్టర్లో తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కామారెడ్డికి వెళ్తారు. అక్కడ కూడా నామినేషన్ వేసిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే రోజు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సిరిసిల్ల, సిద్దిపేటలో నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా ఇదే రోజు నామినేషన్ వేశారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిరలో, వివేక్ వెంకటస్వామి చెన్నూరులో నామినేషన్లు వేశారు. పాలేరులో నామినేషన్ వేయడానికి సిద్ధమవు తున్న కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఉదయాన్నే ఐటీ అధికారులు దాడులకు వెళ్లడం సంచలన సృష్టించింది. అయినప్పటికీ పొంగులేటి ఇవాళే నామినేషన్ వేయనున్నారు. పొంగులేటికి మద్దతుగా రేవంత్‌రెడ్డి, భట్టీ గట్టిగా మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపు ధోరణి మంచిది కాదని వారు హితవు చెప్పారు. పొంగులేటికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఉపసంహరణ ప్రక్రియ మొదలుకానుంది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి.