ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపుపై పెద్ద రచ్చే జరుగుతోంది. టీడీపీ సానుభూతిపరుల ఓటర్లను తొలగిస్తున్నారని, ఇందుకు అధికారులు సహకరిస్తున్నారంటూ ఊరూవాడా మార్మోగేలా టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే టీడీపీ ఓట్లు తొలగించలేదని, తమ ఓట్లు నమోదు చేసుకుంటున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఓట్ల తొలగింపుపై జాతీయ స్థాయిలో కూడా పోరాడాలని టీడీపీ నిర్ణయించింది.
అకారణంగా ఓట్లు తొలగిస్తే తప్పక అడ్డుకోవాలి. గత సార్వత్రిక ఎన్నికల ముందు తమ సానుభూతిపరుల ఓట్లు సుమారు 40 లక్షలు తొలగించారని, ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇది నిజమే అని తేలడంతో తిరిగి ఓటు హక్కు కల్పించడంతో పాటు బాధ్యులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో గతంలో డబుల్ ఓట్లు నమోదు చేసుకోవడం, ఒక చోట తొలగించగా టీడీపీ నేతలు రచ్చ చేయడంపై వైసీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. టీడీపీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసిన ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహయాదవ్ సోదరుడు గొల్ల రామ సతీమణి శాంతి ఓటును తొలగించారని ప్రచారం మొదలు పెట్టారు. ఇందుకు ఎల్లో మీడియా తోడైంది. టీడీపీ కార్పొరేటర్‌గా పోటీ చేయడమే నేరమా? అని ప్రశ్నిస్తూ ఎల్లో మీడియా ఓట్లు తొలగించారని అన్యాయంగా ప్రచారం చేసింది.
అసలు టీడీపీ సానుభూతిపరుల ఓట్లే తొలగించలేదని, అలాంటప్పుడు జాబితా నుంచి ఎలా మిస్ అవుతుందని తిరుపతి వైసీపీ నేతలు పరిశోధన చేశారు. అసలు విషయం ఏమంటే శాంతి, ఆమె భర్త రామ 137, 234 బూత్‌లలో వేర్వేరుగా ఓట్లు నమోదు చేసుకున్నారు. నకిలీ ఓట్లపై ఫిర్యాదులు వెళ్లడంతో ప్రతి ఓటరుపై కేంద్ర ఎన్నికల సంఘం లోతుగా అధ్యయనం చేసింది.
శాంతి, ఆమె భర్త రామ పేర్లతో రెండు ఓట్లు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఒకే ఫొటో వేర్వేరు చోట్ల ఉండడం, అలాగే భర్త లేదా భార్య ఒకేలా ఉంటే, ఒకటి మాత్రం ఉంచి, మిగిలినవన్నీ ఎన్నికల అధికారులే తొలగించారు. ఈ ప్రకారం 137వ బూత్‌లో శాంతి, ఆమె భర్త రామ ఓట్లు ఉంచి, 234వ బూత్‌లో తొలగించారు.
కానీ రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్న విషయాన్ని పసిగట్టలేరనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తీరా అసలు వాస్తవం బయట పడేసరికి తేలు కుట్టిన దొంగల్లా టీడీపీ నేతలు మౌనం పాటించారు. టీడీపీ నేతల డబుల్, త్రిబుల్ ఎంట్రీలు చేసుకుని, ఇప్పుడవి తొలగిపోతున్నాయని రాద్ధాంతం చేస్తున్నారని తిరుపతి వైసీపీ నేతలు మండిపడుతున్నారు.