ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులపై విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులపై తీవ్రమైన నేరాలుంటే, త్వరగా విచారణ జరగాలనే డిమాండ్ చాలా కాలంగా వుంది. అయితే ఇది ఎంతకూ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్గదర్శకాలను సూచించడం విశేషం.
ప్రజాప్రతినిధులపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులపై త్వరగా విచారించాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. తీవ్ర నేరాలకు సంబంధించి ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని సర్వోన్నత న్యాయస్థానం మార్గనిర్దేశం చేసింది. అలాగే కేసులను వేగంగా విచారించి పరిష్కరించే నిమిత్తం వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది.
ఎవరైనా ప్రజాప్రతినిధిపై తీవ్ర నేరాలకు సంబంధించి అభియోగం నిరూపితమైతే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయమై తామింకా నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టు తెలిపింది.
తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవిత కాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిల్‌పై సుప్రీంకోర్టు పైవిధంగా స్పందించింది. చాలా కాలంగా అశ్విని ఉపాధ్యాయ ప్రజాప్రతినిధుల నేరాలపై త్వరగా విచారించాలని న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.