ఎన్నికలంటే యుద్ధాన్ని తలపిస్తాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రచ్చరచ్చే. ఏపీలో అయితే ఎన్నికలతో సంబంధం లేకుండానే అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం ఎలా తిట్టుకుంటున్నారో చూస్తున్నాం. ఈ రాజకీయ పార్టీలకు మించి టీవీ చానళ్ల ప్రతినిధులు రంకెలేస్తున్నారు. దీంతో రాజకీయాలంటేనే విసుగు చెందే పరిస్థితి.
ఈ నేపథ్యంలో రాజకీయాల్లో అప్పుడప్పుడు నవ్వులు పూయించే క్యారెక్టర్లు వుంటే బాగుండు అని ఎవరైనా అనుకుంటున్నారు. అలాంటి వారి కోరికను తీర్చేలా, రాజకీయాల్లో వినోదాన్ని పంచే నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకడున్నారు. ఆయనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రాజకీయాల్లోకి వచ్చి అందరినీ నవ్విస్తూ, ఆయన నవ్వులపాలవుతున్నారు. కొవ్వొత్తి తాను కరిగిపోతూ, వెలుగు నింపినట్టన్నమాట.
తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య భీకర పోరు జరుగుతోంది. బీజేపీ విషయానికి ఉనికి చాటుకోవడానికి అన్నట్టు తిప్పలు పడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంపై కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకునేలా ఉన్నాయి. ఇంతకూ ఆయన ఏమంటున్నారంటే…
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిగ్ ఫిగర్ని తమ పార్టీ సాధిస్తుందని కేఏ పాల్ ఎంతో ధీమాగా చెప్పడం విశేషం. పాల్ చెబుతున్నట్టు ప్రజాశాంతి పార్టీకి 60 సీట్లు దక్కుతాయన్న మాట. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కని వారంతా తమ వెంట నడిస్తే ఎమ్మెల్యే చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.
అధికారంలోకి వస్తుందన్న పార్టీ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్న నాయకులెందరంటే…పాల్ చెప్పిన ప్రకారం 344 అని లెక్క తేలింది. సీరియస్గా రాజకీయాలు నడుస్తున్న వేళ పాల్ కామెడీ భలేభలే అని నవ్వుకోకుండా ఉండగలమా?