సెమిస్ రేసులో ఏయే టీమ్స్?

2023 ప్ర‌పంచ‌క‌ప్ సెమిస్ కు ఏ జ‌ట్లు చేర‌తాయ‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఇప్ప‌టికే టీమిండియా లాంఛ‌నంగా సెమిస్ బెర్త్ ను క‌న్ఫర్మ్ చేసుకుంది.  ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ఇండియా ఎనిమిది విజ‌యాల‌తో 16…

2023 ప్ర‌పంచ‌క‌ప్ సెమిస్ కు ఏ జ‌ట్లు చేర‌తాయ‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. ఇప్ప‌టికే టీమిండియా లాంఛ‌నంగా సెమిస్ బెర్త్ ను క‌న్ఫర్మ్ చేసుకుంది.  ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ఇండియా ఎనిమిది విజ‌యాల‌తో 16 పాయింట్ల‌ను సొంతం చేసుకుని అరివీర భ‌యంక‌ర‌మైన ఫామ్ లో క‌నిపిస్తోంది. పాయింట్ల టేబుల్ లో ఇండియాకు తొలి స్థానం ద‌క్కిన‌ట్టే! ఇండియాకు మిగిలిన ఏకైక మ్యాచ్ నెద‌ర్లాండ్స్ తో. ఆ మ్యాచ్ ఫ‌లితం సెమిస్ స్థానాల‌ను ఏ ర‌కంగానూ ప్ర‌భావితం చేయ‌లేదు!

ఇక రెండో స్థానంలో ప్ర‌స్తుతానికి సౌతాఫ్రికా ఉంది. ఆ జ‌ట్టు 8 మ్యాచ్ ల‌కు గానూ ఆరింట విజ‌యం సాధించి 12 పాయింట్ల‌తో ఉంది. దీనికి సెమిస్ బెర్త్ ఖాయ‌మే. మిగిలిన మ్యాచ్ ను సౌతాఫ్రికా ఆఫ్గానిస్తాన్ తో ఆడాల్సి ఉంది. ఒక‌వేళ ఆఫ్ఘాన్ తో మ్యాచ్ లో ఓడినా.. సౌతాఫ్రికా నెట్ ర‌న్ రేట్ తో అయినా సెమిస్ బెర్త్ ను పొందే అవ‌కాశం ఉంది. 
 
నెట్ ర‌న్ రేట్ లో సౌతాఫ్రికా క‌న్నా కాస్త వెనుక‌బ‌డి ఉన్నా.. ఎనిమిదింటికి ఆరు మ్యాచ్ ల విజ‌యాల‌తో ఆస్ట్రేలియా కూడా సెమిస్ రేసులో ఉంది. ఆఫ్ఘాన్ తో దాదాపు ఓడిపోయే ద‌శ నుంచి ఆస్ట్రేలియా కోలుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా త‌న సెమిస్ ఆశ‌ల‌ను నిల‌బెట్టుకుంది. ఆసీస్ త‌న చివ‌రి లీగ్ మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ లో గెలిస్తే ఆస్ట్రేలియా లాంఛ‌నంగా సెమిస్ స్థానం పొందుతుంది. ఓడితే నెట్ ర‌న్ రేట్ మీద ఆధార‌ప‌డాల్సి ఉంటుంది.

ఇక ఈ ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభంలో మంచి ఊపు మీద క‌నిపించినా..  ఆ త‌ర్వాత వ‌ర‌స ప‌రాజ‌యాల‌తో వెనుక‌ప‌డింది న్యూజిలాండ్. గ‌త నాలుగు మ్యాచ్ లలోనూ న్యూజిలాండ్ ఓట‌మి పాలైంది. ప్ర‌స్తుతం న్యూజిలాండ్, పాకిస్తాన్ లు చెరో  నాలుగు మ్యాచ్ ల విజ‌యాల‌తో నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. వీటిల్లో న్యూజిలాండ్ కే అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి.

ఈ జ‌ట్టుకు మిగిలిన ఏకైక లీగ్ మ్యాచ్ శ్రీలంక‌తో జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ లో విజ‌యం సాధిస్తే.. ఐదు విజ‌యాల‌తో న్యూజిలాండ్ ప‌ది పాయింట్ల‌తో పోటీలో ఉంటుంది. ఆ త‌ర్వాత  ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచ్ ఫ‌లితం మీద కూడా న్యూజిలాండ్ అవ‌కాశాలు ఆధార‌ప‌డ‌తాయి. ఇంగ్లండ్ గ‌నుక పాక్ ను ఓడిస్తే.. న్యూజిలాండ్ అవ‌కాశాలు మెరుగ్గా ఉంటాయి.

శ్రీలంక మీద గెల‌వాలి, ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓడిపోతే.. న్యూజిలాండ్ సేఫ్. ఒక‌వేళ ఇంగ్లండ్ పై పాక్ నెగ్గినా.. నెట్ రేట్ విష‌యంలో న్యూజిలాండ్ స్వ‌ల్పంగా ముందుంది. అలా కివీస్ కు మెరుగైన అవ‌కాశాలుంటాయి. శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే పాక్ అవ‌కాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే క‌నీసం ఆప్ఘాన్ మీద గెల‌వ‌లేక‌పోయిన శ్రీలంక న్యూజిలాండ్ పై గెలుస్తుందా? అనేది అనుమాన‌మే!

ఏతావాతా.. ఇండియా స్థానం ఖాయ‌మైంది. సౌతాఫ్రికాకు అన్ని దార్లూ తెరుచుకునే ఉన్నాయి. ఆస్ట్రేలియా అవ‌కాశాలూ పుష్క‌లంగానే ఉన్నాయి. నాలుగో స్థానం విష‌యంలో కివీస్, పాక్ మ‌ధ్య‌న కాస్త పోటీ ఉంది. న్యూజిలాండ్ వ‌ర్సెస్ శ్రీలంక‌, పాక్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్ లు డిసైడ‌ర్ గా నిల‌వ‌బోతున్నాయి.