కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించుకుని డీప్ ఫేక్ పేరుతో నగ్న, బోల్డ్ పిక్చర్స్ ను సృష్టిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఇది నేరమని స్పష్టం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ -2000లోని 66డీ సెక్షన్ ప్రకారం డీప్ ఫేక్ వీడియో, ఫొటోలు క్రియేట్ చేయడం నేరం కిందే వస్తుందని పేర్కొంది. ఈ నేరం కింద కనీసం మూడేళ్ల పాటు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకూ జరిమానా పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
లక్ష రూపాయల జరిమానా సంగతెలా ఉన్నా.. మూడేళ్ల జైలు శిక్షను అయినా ఇలాంటి నేరగాళ్లు గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ షార్ట్ ముందుగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఉన్నది ఆమేనని చాలా మంది దాన్ని చూసి ఆశ్చర్యపోసాగారు. అయితే కాస్త ఎరిగిన వారు మాత్రం అది డీప్ ఫేక్ అని అర్థం చేసుకోగలిగారు.
ఈ అంశంపై అమితాబ్ బచ్చన్ ముందుగా స్పందించారు. అలాంటి డీప్ ఫేక్ లపై చర్యలు తీసుకోవాలని బిగ్ బి ట్వీట్ చేశారు. ఆ తర్వాత సెలబ్రిటీలంతా ఈ అంశంపై స్పందించసాగారు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు అనేక మంది స్పందిస్తూ.. వీటిని అరికట్టాలనే డిమాండ్ ను చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్రం స్పందిస్తూ.. డీప్ ఫేక్ లకు హెచ్చరిక జారీ చేసింది. అయితే ఇప్పటికే ఇంటర్నెట్ లో డీప్ ఫేక్ అల్లుకుపోయింది. ఈ టెక్నాలజీతో దేన్నైనా సృష్టించగలుగుతున్నారు. వీటికి మూలాలు విదేశాల్లో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దేశీయంగా ఇలాంటి పనులు చేస్తే.. వాటి మూలాలను కనుక్కోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఫిర్యాదులు చేస్తే చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.