కాంగ్రెస్‌లో మొదటి రచ్చ: ఉత్తమ్ ఫ్యామిలీ ప్యాకేజే!

ఇప్పుడు పార్టీ మంచి ఊపు మీద ఉంది. కర్ణాటకలో గెలిచిన తర్వాత.. తెలంగాణలో కూడా శకునాలు బాగా కనిపిస్తున్నాయి. ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారనే నమ్మకంతో నాయకులు చాలా మంది ఆ పార్టీలో చేరడానికి…

ఇప్పుడు పార్టీ మంచి ఊపు మీద ఉంది. కర్ణాటకలో గెలిచిన తర్వాత.. తెలంగాణలో కూడా శకునాలు బాగా కనిపిస్తున్నాయి. ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారనే నమ్మకంతో నాయకులు చాలా మంది ఆ పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు. ‘కుదిరితే ఇప్పుడు.. లేకపోతే ఎప్పటికీ లేదు..’ అనే నినాదాన్ని చదువుకుంటున్నట్టుగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి వచ్చేయగలం అని అనుకుంటూనే ఉన్నారు. దానికి తగిన కసరత్తులు చేస్తున్నారు. 

లక్షల్లో ఫీజు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కు దరఖాస్తు చేసుకోమంటే.. దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా అప్లికేషన్లు వచ్చాయంటే.. పార్టీ మీద ఎందరికి ఆశలున్నాయో అర్థమవుతుంది. అదే సమయంలో.. గత ఎన్నికల్లో ఏదో అవసరార్థం ఎంపీ పదవుల్లోకి వెళ్లిన వారు మాత్రమే కాదు.. సాంప్రదాయంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటినుంచి ఎంపీ సీటుకు మాత్రమే పోటీచేస్తున్న వారు కూడా.. ఈసారి ఎమ్మెల్యే టికెట్లకు దరఖాస్తు చేసుకోవడం గమనిస్తే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తుందని, ఆ అధికార వైభవాన్ని పంచుకోవడంలో తాము వెనకపడకూడదని వారంతా ఆత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇలాంటి సమయంలోనే మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్న ఫ్యామిలీ ప్యాకేజీ ఇప్పుడు టికెట్ల కేటాయింపులో తొలి వివాదంగా తయారు కాబోతున్నది. దరఖాస్తులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డిలకు మాత్రమే క్లియర్ వేకెన్సీ ఉంది. తతిమ్మా అన్ని నియోజకవర్గాలకు ఒకటికంటె ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎప్పటిలాగా తన కుటుంబంలో రెండు టికెట్లు కావాలని కోరుకుంటున్నారు. ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఈ జోడు టికెట్ల జగడంపై నాయకుల మధ్య మాటామాటా పెరిగినట్టు గుసగుసలు కూడా వినిపించాయి.

ఏది ఏమైనప్పటికీ.. మొత్తానికి ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు అనే అంశంపై వివాదం మాత్రం రేగింది. ఉత్తమ్ కుటుంబానికి అలా ఇచ్చేట్లయితే.. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయని, తమకు కూడా అలా కావాలని డిమాండ్ చేసేవారు ఆ పార్టీలో చాలా మందే ఉన్నారు. వారి తాకిడిని పార్టీ తట్టుకోవడం మాత్రం కష్టమే. అలాగని.. తనతో పాటు, తన భార్యకు కూడా ఇవ్వకపోతే ఉత్తమ్ ఊరుకునేలా కూడా లేరు.

కానీ ఉత్తమ్ పరిస్థితి చాలా సేఫ్ గా ఉంది. ఢిల్లీ లెవెల్లో అయినా ఒత్తిడి చేసుకుని ఆయన తమ దంపతులకు టికెట్లు పుచ్చుకుంటారు. వారు గెలవడంతో పాటు, రాష్ట్రంలో పార్టీ కూడా గెలిచి అధికారంలోకి వస్తే.. పదవులను పంచుకుని ఆ వైభవం వెలగబెడతారు. వారు గెలిచి పార్టీ ఓడిపోతే.. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి.. మరో నాలుగు నెలల్లోగా తగుదునమ్మా అంటూ ఎంపీ ఎన్నికలకు తయారుగా ఉంటారు. ఏ రకంగానైనా తనకు వైభవలోపం లేకుండా జాగ్రత్త పడుతుంటారు.

కానీ ఆయన తన స్వార్థంచూసుకుంటున్నారు తప్ప పార్టీ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని కార్యకర్తల మాట. ఇద్దరికి టికెట్లు ఇవ్వడం గురించి మాత్రమేకాదని.. వారికి ఇవ్వడం వలన.. పార్టీలో చెలరేగే ఇతర నాయకుల డిమాండ్ల గురించి ఆలోచించాలని వారు అంటున్నారు. మరి ఏదైనా జరగగల అవకాశం ఉన్న కాంగ్రెసులో పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి.