ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ కోసం బలైన కుటుంబాన్ని ఆదుకోలేని దుస్థితి. అధికారంలో ఉన్నప్పటికీ బాధిత కుటుంబాన్ని ఆదుకోలేని దయనీయ స్థితిలో వుంటే, ఎవరైనా ఆ పార్టీని నమ్మి ఎలా ముందుకొస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. 2022, అక్టోబర్ 8న వైసీపీ మాజీ సమన్వయకర్త చౌలూరు రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు. ఈయన ఎదుగుదలను ఓర్వలేక సొంత పార్టీ నాయకులే కుట్రపన్ని అంతమొందించారు.
చౌలూరు రామకృష్ణారెడ్డి కుటుంబానికి హిందూపురంలో మంచి పేరు వుంది. వీరిది రాజకీయ కుటుంబం. టీడీపీకి కంచుకోట అయిన హిందూపురంలో మొట్టమొదట వైసీపీ జెండా మోసింది రామకృష్ణారెడ్డే. వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలంటూ ఆయన పాదయాత్ర కూడా చేశారు. వైసీపీకి భవిష్యత్ ఉందనే నమ్మకం ఏర్పడిన తర్వాత హిందూపురం రాజకీయాల్లోకి ఎవరెవరో వచ్చారు.
తనకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అభిమానంతో రామకృష్ణారెడ్డి జగన్ వెంటే నడిచారు. ఈ నేపథ్యంలో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు రామకృష్ణారెడ్డి ఉసురు తీశాయి. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ నిందితుడు కావడం గమనార్హం. హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పది రోజుల క్రితం హత్య కేసులో నిందితులు బెయిల్పై బయటికి వచ్చారు. వీరిలో యువకుడైన ఒక నిందితుడు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో రామకృష్ణారెడ్డి సోదరి మధుమతికి వార్నింగ్ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. తాను బెయిల్పై వచ్చి సిగరెట్ తాగుతూ తిరగానని, ఎవరూ టచ్ చేయలేకపోయారని చెప్పుకొచ్చాడు. రామకృష్ణారెడ్డి ఎలాంటి వాడో తెలుసుకోవాలని, తన జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయంటూ మధుమతికి సదరు హత్య కేసు నిందితుడు వార్నింగ్ ఇవ్వడం బాధిత కుటుంబాన్ని, వారి అనుచరులను ఆందోళనకు గురి చేస్తోంది.
అధికార పార్టీకి చెందిన బాధిత కుటుంబాన్ని హెచ్చరిస్తుంటే, పార్టీ పెద్దలు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి రౌడీషీటర్లను పెంచి పోషిస్తే సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించరా? అనే నిలదీత ఎదురవుతోంది. హిందూపురంలో వైసీపీ బలోపేతానికి చివరికి ప్రాణాలను సైతం పోగొట్టుకున్న రామకృష్ణారెడ్డి కుటుంబానికే అధికార పార్టీ అండగా నిలవకపోతే, ఎవరైనా రానున్న రోజుల్లో పార్టీ కోసం పని చేయడానికి ఎలా ముందుకొస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వైసీపీ పెద్దల అండదండలతోనే సదరు హత్య కేసు నిందితుడు బెయిల్పై వచ్చి రెచ్చిపోతున్నాడని, ఇప్పటికైనా అతని ఆగడాలను అరికట్టకపోతే రానున్న రోజుల్లో సమాజానికే ప్రమాదకారిగా మారుతాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.