టీడీపీ ప్ర‌భంజ‌నం వీస్తుంటే.. పొత్తులెందుక‌య్యా!

వినేవాళ్లుంటే చంద్ర‌బాబు ఎన్నైనా మాట‌లు చెబుతారు. ఢిల్లీలో మీడియాకు కూడా త‌న స‌హ‌జ ధోర‌ణిలో కోత‌లు కోశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం ప్ర‌భంజ‌నం వీస్తోంద‌ని అన్నారు. జ‌గ‌న్ దుర్మార్గ పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడేందుకు ప్ర‌జ‌లు…

వినేవాళ్లుంటే చంద్ర‌బాబు ఎన్నైనా మాట‌లు చెబుతారు. ఢిల్లీలో మీడియాకు కూడా త‌న స‌హ‌జ ధోర‌ణిలో కోత‌లు కోశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగుదేశం ప్ర‌భంజ‌నం వీస్తోంద‌ని అన్నారు. జ‌గ‌న్ దుర్మార్గ పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడేందుకు ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నార‌ని అన్నారు.

ఇదే సంద‌ర్భంలో పొత్తుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పొత్తుల‌పై సానుకూల ధోర‌ణిలో మాట్లాడారు. కేంద్రంలో మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌న్న బీజేపీతో స్నేహ హ‌స్తం కోసం చంద్ర‌బాబు అర్రులు చాచ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. అబ్బే.. బీజేపీతో నాకెలాంటి విభేదాలు లేవు, అప్ప‌ట్లో ప్ర‌త్యేక హోదా కోస‌మే గొడ‌వంతా అని అన్నారు. ఎన్నిక‌ల్లో పొత్తుల‌పై కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని తెలిపారు. పొత్తులు పెట్టుకోవ‌డం టీడీపీకి కొత్త కాద‌ని చెప్పారు. ఇప్ప‌టికైతే పొత్తుల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని అన్నారు.

ఒక‌వైపు జ‌గ‌న్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని జాతీయ మీడియాకు చెబుతూ, మ‌రోవైపు టీడీపీ ప్ర‌భంజ‌నం వీస్తోందంటూ, పొత్తుల కోసం వెంప‌ర్లాడ‌డంపై జ‌నం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్ర‌భంజ‌నం వీస్తుంటే ప‌క్క పార్టీలతో అంట‌కాగాల్సిన ప‌నేంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. పొత్తుల‌ను కొట్టి పారేయ‌లేదంటే జ‌గ‌న్‌ను ఒక్క‌డిగా ఎదుర్కోలేననే సంకేతాలు పంపార‌ని జాతీయ మీడియా భావిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.  

ఏపీలో వైసీపీ బ‌లంగా ఉండ‌డంతోనే పొత్తుల కోసం చంద్ర‌బాబు అగ‌చాట్లు ప‌డుతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కేవ‌లం కేంద్ర ప్ర‌భుత్వ అండ‌కోస‌మే ఏపీలో ఏ మాత్రం బ‌లం లేని బీజేపీని ప్ర‌స‌న్నం కోసం చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. టీడీపీ ప్ర‌భంజ‌నం అని చంద్ర‌బాబు గ‌ట్టిగా చెబుతున్నారంటేనే, ఆ పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌ని బాబు ప‌రోక్షంగా చెప్పిన‌ట్టు అవుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. 

క‌నీసం త‌న కుమారుడు లోకేశ్‌, ద‌త్త పుత్రుడిగా ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శించే ప‌వ‌న్‌క‌ల్యాణ్ గెలుపుపై కూడా గ్యారెంటీ లేద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ద‌ఫా మ‌ళ్లీ జ‌గ‌నే అధికారంలోకి వ‌స్తే… టీడీపీని శాశ్వ‌తంగా మూసుకోవాల్సి వ‌స్తుంద‌నే భ‌యం చంద్ర‌బాబుతో ఏవేవో మాట్లాడిస్తోంద‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.