తండేల్ – మంచి బజ్ తెచ్చుకున్న లేటెస్ట్ తెలుగు సినిమా. సాయిపల్లవి, నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు చందు మొండేటి గ్రేట్ ఆంధ్రతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఊహించకుండా ఈ సినిమా తన చేతిలోకి వచ్చిందని వివరించారు.
తాను వేరే సినిమా సూర్య హీరోగా చేయాల్సి ఉన్నా, అనుకోకుండా తండేల్ కథలో పది నిమిషాలు వినే అవకాశం వచ్చిందని, అక్కడి నుంచి దానితో కనెక్ట్ అయిపోయానని తెలిపారు. నిజానికి, ముందుగా ఈ కథ డాక్యుమెంటరీలా ఉంటుందని భావించి నిర్మాత అల్లు అరవింద్ పక్కన పెట్టారని, కానీ తనకు నచ్చడంతో వెనుకాడకుండా సినిమాను నిర్మించారని చెప్పారు.
తండేల్ కథకు “మణిరత్నం” రోజా సినిమా ఛాయలు ఉన్నాయని అనుకోవచ్చని, కానీ రోజాలో హీరో తన కోసం ఫైట్ చేస్తాడని, ఇక్కడ హీరో తన కుటుంబం కోసం పోరాడతాడని వివరించారు. సాయిపల్లవి, నాగ చైతన్యలను తప్ప మరెవరినీ ఈ పాత్రల్లో ఊహించలేమని, వాళ్లు అద్భుతంగా జీవించేశారని అన్నారు.
ఓ సినిమాను భారీ వ్యయంతో, ఎన్నో కష్టాలను తట్టుకుని నిర్మించడం అంటే తండేల్ ఒక ఉదాహరణని, సముద్రంపై రోజూ షూటింగ్ చేస్తే మూడు గంటల పని కూడా జరగడం కష్టమేనని వివరించారు. ఎండలో, సముద్రం మీద ఇబ్బందులు ఎదుర్కొంటూ చైతన్య, సాయిపల్లవి షూట్ చేసిన తీరు తనను ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పారు.
సినిమాలో పాకిస్తాన్ జైలు ఎపిసోడ్ మొత్తం కలిపి కేవలం 20 నిమిషాలే ఉంటుందని, అది స్క్రీన్‌ప్లే ప్రకారం అంతటా పరిచితమవుతుందని తెలిపారు. మిగిలిన సినిమా మొత్తం రాజు-బుజ్జితల్లి ప్రేమ కథ గురించే ఉంటుందని అన్నారు. సినిమా మొత్తం ఆ ఇద్దరి మధ్యే సాగుతుందని, రెండే ఫైట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. హీరో-హీరోయిన్ కొంత సేపు కథ ప్రకారం దూరంగా ఉన్నా, సినిమాలో ఆలా అనిపించదని, వారి ప్రేమకథ సాఫీగా కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.
కార్తికేయ 3 త్వరలో ఉంటుందని, ఎప్పుడైనా తీసినా, అది కార్తికేయ 2 ఇచ్చిన విజయానికి కృష్ణ పరమాత్మకు తాను అందించే కృతజ్ఞతా సమర్పణగా ఉంటుందని చందు మొండేటి చెప్పారు.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ