బిజెపి బంధం కోసం ఊసరవెల్లి రాజకీయం!

చంద్రబాబునాయుడు.. ఎన్టీఆర్ నాణెం విడుదల అనే సాకు పెట్టుకుని ఢిల్లీ వెళ్లి అక్కడ జెపినడ్డా పక్కన కుర్చీలో కూర్చుని, ఆయనతో మాట్లాడుతున్నట్టుగా నాలుగు ఫోటోలు తీయించుకుని.. వాటిని తెలుగు మీడియాకు ప్రత్యేకంగా లీకులు చేయించి..…

చంద్రబాబునాయుడు.. ఎన్టీఆర్ నాణెం విడుదల అనే సాకు పెట్టుకుని ఢిల్లీ వెళ్లి అక్కడ జెపినడ్డా పక్కన కుర్చీలో కూర్చుని, ఆయనతో మాట్లాడుతున్నట్టుగా నాలుగు ఫోటోలు తీయించుకుని.. వాటిని తెలుగు మీడియాకు ప్రత్యేకంగా లీకులు చేయించి.. చాలా చాలా తెలివితేటలు ప్రదర్శించారు. 

స్వయంగా బిజెపిలో చంద్రబాబు కోవర్టు అయిన సీఎం రమేషే.. ఒక పెద్దాయన ఆ ఫోటోను మీడియాకు లీక్ చేయమని అన్నాడు.. అంటూ అసలు సీక్రెట్ బయటపెట్టారు కూడా. ఢిల్లీయాత్రలో.. తాను ప్రజల్లోకి ఏ పుకార్లనయితే స్వయంగా పంపించాడో.. వాటిని మరింతగా పెంచడం ఇంపార్టెంట్ అని చంద్రబాబు అనుకున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి భాజపాతో పొత్తు కుదరుతుందనే సంకేతాలు పంపడానికి ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబునాయుడు ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడుతూ.. బిజెపికి తాము దగ్గరవుతున్నాం అని అందరూ అనుకునేలా కొన్ని డైలాగులు సంధించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా జాతీయవాదంతో ఉండే పార్టీ అని, జాతీయ రాజకీయాలతో ఆ పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉన్నదని చెప్పారు. తమాషా ఏంటంటే.. ప్రస్తుత తరుణంలో జాతీయవాదం అంటేనే భారతీయ జనతా పార్టీకి జైకొట్టడం అనే అర్థం స్థిరపడిపోయింది. 

జాతీయ రాజకీయాలతో అనుబంధం అంటేనే.. భాజపాతో అనుబంధం అన్నట్టుగా అర్థాలు పునర్నిర్వచింపబడుతున్నాయి. ఢిల్లీలో కూర్చుని చిలకపలుకుల్లాగా జాతీయవాదం పాట పాడడం అంటే.. చంద్రబాబునాయుడు బిజెపితో పొత్తు సంకేతాలు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నమే.

2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీని చంద్రబాబునాయుడు ఎంతెంత దారుణంగా తిట్టిపోశారో.. బిజెపిలో చాలా మంది నాయకులకు ఇప్పటికీ గుర్తుంటుంది. రాష్ట్రంలో తన అయిదేళ్ల పాలనలోని వైఫల్యాలు అన్నింటినీ, మోడీ సర్కారు మీదికి నెట్టేసి తాను పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు ఆ కుట్ర రాజకీయాలు నడిపించారనే సంగతి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు, ఆనాటి తన కుట్రలన్నింటికీ చంద్రబాబు ఒక చక్కెరపూత లాంటి వివరణ ఇచ్చుకుంటున్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో విభేదించాను తప్ప.. మిగిలిన  విషయాల్లో కేంద్రంతో అప్పట్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని కూడా చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఈ మాయమాటలన్నీ గమనిస్తే.. బిజెపితో మళ్లీ బంధం ముడిపెట్టుకోవడానికి ఆయన పూర్తిస్థాయిలో దిగజారి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి వారు, చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడతారో.. ఆయన ఊసరవెల్లి రాజకీయాల గురించి గతంలోనే అనుభవం ఉన్నది గనుక జాగ్రత్త పడతారో వేచిచూడాలి.