వైసీపీ ఎమ్మెల్యేల్లోనూ, అలాగే మంత్రి వర్గంలోనూ పిన్న వయస్కురాలు విడదల రజనీ. రాజకీయాల్లో విడదల రజనీ అదృష్టజాతకురాలు. సార్వత్రి ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరడం, అదే రోజు చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమితులు కావడం, ఎమ్మెల్యేగా గెలుపొందడం చకచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే నాటికి ఆమె వయసు కేవలం 28 సంవత్సరాలు.
సగం పాలన పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ విడదల రజనీకి కలిసొచ్చింది. 31 ఏళ్లకే ఆమె మంత్రి అయ్యారు. అందులోనూ కీలక వైద్యారోగ్యశాఖ మంత్రి పదవిని దక్కించుకున్నారు. దీంతో రజనీకి, ఆమె అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. విడదల రజనీ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు.
వైసీపీలో జగన్ తర్వాత సోషల్ మీడియాలో ఆమెకే ఎక్కువ ఆకర్షణ. సహజంగానే ఆమెపై అందరి దృష్టి పడింది. మంచి చేస్తే పట్టించుకునే వాళ్లు తక్కువ. ఇదే నెగెటివిటీకి ఎక్కువ ప్రచారం వుంటుంది. ఉదాహరణకు విడదల రజనీకి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం మొదలైనప్పటి నుంచి ….గతంలో వైఎస్ జగన్‌పై రజనీ ఘాటు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇక మంత్రి అయిన తర్వాత కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదలు తన శాఖకు సంబంధించిన వివాదాలు తెరపైకి వచ్చాయి. మొదట విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ దుర్ఘటన జగన్ ప్రభుత్వానికి మచ్చే. దీన్ని మరిచిపోకనే తిరుపతి రుయాలో మరో అమానవీయం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బాలుడి శవాన్ని స్వస్థలానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకోవడం వెలుగు చూసింది. కుమారుడి శవాన్ని భుజాలపై వేసుకుని ద్విచక్ర వాహనంలో తరలించడం పతనమవుతున్న మానవతా విలువల్ని ప్రతిబింబించింది. ఈ రెండు ఘటనలు మంత్రి విడదల రజనీకి సంబంధించినవి కావడం విశేషం.
దీంతో సహజంగానే రజనీ ఒకింత ఒత్తిడికి గురి అవుతుంటారు. గత మూడేళ్లలో కేవలం నియోజకవర్గ సమస్యలనే చూసిన రజనీకి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యానికి సంబంధించిన సమస్యలు అదనం. ఇవన్నీ ఒక ఎత్తైతే, కీలకమైన వైద్య రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిధుల కొరత అడ్డంకిగా మారింది. మిగిలిన సమస్యలు ఎన్ని వున్నా, డబ్బు పుష్కలంగా వుండి వుంటే, చిటికెలో పరిష్కరించేవాళ్లు. కానీ ఆ పరిస్థితి లేదని రజనీకి బాధ్యతలు చేపట్టిన రోజే తెలిసి వుంటుంది.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో వైద్య సమస్యలు మరిన్ని తెరపైకి వస్తాయి. వాటిని ప్రత్యర్థులు రాజకీయంగా వాడుకునే క్రమంలో అధికార పార్టీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తాయి. వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత రజనీపై ఉంది. ట్విటర్, ఇన్‌స్టా, ఇతరత్రా మాధ్యమాల వేదికగా తన దృష్టికి వచ్చే సమస్యలపై రజనీ వెంటనే స్పందించాలి. ఇటీవల ఓ సామాన్య వ్యక్తి తన కుమారుడు రైల్వే ప్రయాణిస్తూ సెల్‌ఫోన్‌కు స్పందించకపోవడంపై ఆందోళనతో సాయం కోసం రైల్వేశాఖ మంత్రికి ట్విటర్ ద్వారా వేడుకున్నారు. అర్ధగంటలోపే ఆ తండ్రికి ఊరటనిస్తూ …నేరుగా కుమారుడితో మాట్లాడించేలా రైల్వేమంత్రి చర్యలు తీసుకున్నారు.
ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని రజనీ పని చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చుకోవాలి. ఏ బాధ్యతలైనా భారమే. కానీ వాటిని నెరవేర్చుకోవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు. పిన్న వయసులోనే కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రి విడదల రజనీకి తనను తాను గొప్పగా ఆవిష్కరించుకునే అవకాశం దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఆమె ఆలోచనలపై ఆధారపడి వుంది. పదవి శాశ్వతం కాదు. సమస్యల గురించి దిగులు చెందకుండా, వాటి పరిష్కారానికి తీసుకునే చర్యలే సమాజంలో గుర్తుంటాయని రజనీ గ్రహించాలి.