రుయా ఆస్పత్రి పాపం ఈనాటిది కాదు. ఇప్పుడు బయట పడింది కాబట్టి డిబేట్లు, చర్చలు జరుగుతాయి. పత్రికలకు, టీవీలకి రెండు రోజులు వార్తలు దొరుకుతాయి. ఒకరిద్దరిపై వేటు పడుతుంది. నాలుగు రోజులకి అంతా మామూలే. నాలుగు కొమ్మలు నరికితే చెట్టుకి ఏమీ కాదు. వేర్లు భద్రంగా వుంటాయి.
రుయాలోనే కాదు, అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మెడికల్ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. ఫలితం ఏమంటే పేదలు బాధలు పడుతున్నారు. చివరికి శవాల్ని కూడా తీసుకెళ్లలేని స్థితి.
అంబులెన్స్‌లు విపరీతంగా వసూలు చేయడం పాత విషయమే. దుఃఖంలో ఉన్న వాళ్లని పీల్చి పిప్పి చేస్తారు. అందరూ సిండికేట్‌గా మారిపోయి రేట్లు తగ్గించరు. వాళ్లకి వ్యతిరేకంగా మాట్లాడితే కొట్టినంత పని చేస్తారు. కొడతారు కూడా. గతంలో బినామీ పేర్లతో అంబులెన్స్ వ్యాపారం చేసిన డాక్టర్ల సంఖ్య కూడా తక్కువేం కాదు.
రోగులంతా పేద, మధ్య తరగతి వాళ్లే కాబట్టి, వాళ్లు ఆస్పత్రిలో అడుగు పెట్టగానే బ్రోకర్లు అనే గద్దలు వాసన పడతాయి. మాటలు కలిపి ఇక్కడ సరిగా చూడరని భయపెడతారు. రోగి స్తోమత బట్టి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి కమిషన్ తీసుకుంటారు. డబ్బులు అయిపోగానే ప్రైవేట్ ఆస్పత్రి వాళ్లు తరిమేస్తే మళ్లీ రుయాకే వస్తారు.
అడ్మిట్ అయిన రోగుల పరిస్థితి వేరు. ఆస్పత్రిలో ఎలాగూ మందులు వుండవు కాబట్టి బయటి నుంచి తెచ్చుకోమంటారు. ఆపరేషన్ సమయంలో కూడా రకరకాల మందులు కొనిపిస్తారు. అవి వాడకుండా మళ్లీ షాపుకే అమ్ముకునే సిబ్బంది కూడా వున్నారు. బ్లడ్ బ్యాంక్ దందా అది వేరే.
కీలకమైన స్థానాల్లో ఉన్న డాక్టర్లలో ఎంత మందికి తిరుపతిలో స్కానింగ్ కేంద్రాలున్నాయో అందరికీ తెలుసు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తరచుగా అవి ఎందుకు చెడిపోతాయో కూడా తెలుసు.
డాక్టర్లలో ఎక్కువ మందికి సొంత ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. పేదవాళ్లకి శ్రద్ధగా వైద్యం చేసే టైం లేదు. అనవసరంగా రాజకీయ నాయకుల్ని ఆడిపోసుకుంటారు కానీ, తిరుపతి పరిసరాల్లో కాళహస్తి, పుత్తూరు. భాకరాపేట, నేండ్రగుంట వరకూ డాక్టర్లు ఎన్ని భూములు కొన్నారో లెక్కలు తీస్తే తెలుస్తుంది. సిన్సియర్‌గా పని చేసే డాక్టర్లు లేరని కాదు, వాళ్లని పని చేయనివ్వరు. ఫిజీషియన్‌గా వున్న డాక్టర్ని గుండె జబ్బుల విభాగంలో వేస్తారు. అతనికి సంబంధం లేని పని ఏదో చేయిస్తారు. రుయాలోని కార్డియాలజీ విభాగం గతంలో స్పెషలిస్టులు లేకుండా కూడా నడిచింది. డయాగ్నసిస్‌లో తప్పు జరిగితే ఎవరు బాధ్యులు?
గతంలో మా తాతకి కాలు పుండు పడితే అనంతపురంలోని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కాలు తొలగించాలని చెబితే తిరుపతికి తీసుకొచ్చి రుయాలో చేర్చాం. రెండు రోజుల తర్వాత ఆయనకి ఆకుపచ్చ డ్రెస్ వేసి కూచోపెట్టారు. ఇంతలో తెలిసిన ఒక డాక్టర్ కనిపించి తాతని చూసి యాంపుటేషన్ అవసరం లేదని అక్కడున్న వాళ్లను తిట్టి తాను ట్రీట్ చేశాడు. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత మా తాత తన రెండు కాళ్లు ఉండగానే ప్రశాంతంగా చనిపోయాడు.
ఏర్పేడు దగ్గర ఇరువర్గాల ఘర్షణలో ఒక వ్యక్తి గాయపడితే వరుసగా సెలైన్లు ఎక్కించేసరికి సుగర్ పెరిగి కోమాలో వెళ్లి చనిపోయాడు. రుయా చేసిన పాపానికి హత్య కేసులో ఇరుక్కుని నలుగురు కోర్టులకి తిరిగి జైలుకి వెళ్లారు. మానవ తప్పిదాలు జరగవని కాదు, తప్పిదాలు చేయడానికే ఆస్పత్రులు వుండకూడదు కదా!
మెటర్నిటీ ఆస్పత్రిలో అయితే ప్రసవం జరిగి బిడ్డని ఇంటికి తీసుకెళ్లే వరకూ ధరలు నిర్ణయించేశారు. గతంలో ఆడపిల్ల పుడితే తక్కువ, మగ పిల్లాడికి ఎక్కువ డబ్బులు తీసుకునేవాళ్లు. కాలం మారింది కదా, ఇప్పుడు లింగ వివక్ష పోయినట్టుంది. ఇద్దరూ సమానమే.
విడదల రజనీ ఆరోగ్యవైద్యశాఖ మంత్రిగా చిన్న వయసులోనే బాధ్యత స్వీకరించారు. ఎమ్మెల్యేగా ప్రజల్లో తిరిగి సమస్యలు అర్థం చేసుకున్న వ్యక్తి. మంత్రిగా కొంచెం దృష్టి సారిస్తే (ఆమెకి ఏ మేరకు పవర్స్ వున్నాయో మనకి తెలీదు) ఈ మాఫియాకి కొంచెం అడ్డుకట్ట వేయచ్చు. పూర్తిగా అసాధ్యం. ఎందుకంటే డాక్టరే చెడిపోయినపుడు వైద్యం బాగుపడుతుందా?
-జీఆర్ మహర్షి