ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీతో నిశ్చితార్థానికి ముందే విడాకులు తీసున్నట్టయ్యింది.
ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడంటూ గత కొద్ది కాలంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్త నిజమేనా అని కొందరు ఆశ్చర్యపోయారు. లేవడానికి కూడా ఓపిక లేని స్థితిలో చతికిలపడిపోయిన కాంగ్రెసులో అంత పెద్ద వ్యూహనిపుణుడు చేరడమేమిటా అని సర్వత్రా చర్చనీయాంశమయింది.
కానీ ఆ వార్తల్ని తిప్పి కొడుతూ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరబోవట్లేదన్న వార్త వెలువడింది.
అయితే ఈ నేపథ్యంలోని ఐదు కారణాలు వెలుగులోకొచ్చాయి.
1. కాంగ్రెస్ పార్టీలో గణనీయమైన మార్పుల్ని తీసుకురావాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు, ఆ మార్పుల విషయంలో తనకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ కోరినట్టు తెలుస్తోంది. అయితే దానికి హై కమాండ్ ఒప్పుకోకుండా ప్రశాంత్ ని కేవలం ఎన్నికల వ్యూహ రచనకే పరిమితం చేయడం జరిగింది.
2. సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా తమ మద్దతుని ప్రశాంత్ కిషోర్ కి ఇవ్వగా, రాహుల్ గాంధీ మాత్రం సమ్మతించలేదని మరొక లోపలి వార్త.
3. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీకి సారధ్యం వహించి వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ పై ఎంత వరకు విశ్వాసం చూపించాలో తెలియని పరిస్థితి కాంగ్రెస్ నాయకత్వానికి ఎదురయింది.
4. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మార్పులపట్ల సుముఖత లేదు. ప్రశాంత్ సారధ్యంలోని మార్పులు తమ ఉనికిని ప్రశ్నార్థకంలో నెడతాయని సీనియర్లు భావించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నాయకత్వం కూడా ఈ విషయంలో కంగారుపడిన మాట వాస్తవం.
5. ప్రశాంత్ కిషోర్ గతంలో నెలకొల్పిన ఐపాక్ కంపెనీ ప్రస్తుతం టీఆరెస్ పార్టీకి ఎన్నికల వ్యూహరచన చేస్తోంది. అయితే ఆ కంపెనీకి తనకి ఇప్పుడు సంబంధం లేదని చెప్పడంపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం కలగలేదు.
ఇలాంటి అనేకమైన అపనమ్మకాలు, అనుమానాలు వ్యక్తమవడంతో ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పగ్గాలు పూర్తిగా దక్కలేదు. పర్యవసానంగా ఆయన కాంగ్రేసులో చేరలేదు.