టీడీపీ త‌ర‌ఫున కొత్త సీఎం అభ్య‌ర్థి!

ఏపీలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులు ఎక్కువ‌వుతున్న‌ట్టుగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సీఎం అభ్య‌ర్థి అన్న‌ట్టుగా బీజేపీ నేత‌లు మాట్లాడారు. ఆ త‌ర్వాత వాళ్లే త‌మ పార్టీ సీఎం అభ్య‌ర్థిని నిర్ణ‌యించేది తాము కాదంటున్నారు.…

ఏపీలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థులు ఎక్కువ‌వుతున్న‌ట్టుగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సీఎం అభ్య‌ర్థి అన్న‌ట్టుగా బీజేపీ నేత‌లు మాట్లాడారు. ఆ త‌ర్వాత వాళ్లే త‌మ పార్టీ సీఎం అభ్య‌ర్థిని నిర్ణ‌యించేది తాము కాదంటున్నారు. ఢిల్లీ నుంచి ఎవ‌రి పేరు సీల్డ్ క‌వ‌ర్లో వ‌స్తే వాళ్లే సీఎం అన్న‌ట్టుగా క‌మ‌లం పార్టీ వాళ్లు స‌ర్దుకున్నారు.

తిరుప‌తి ఎంపీ సీటు ఉప ఎన్నిక నేప‌థ్యంలో కొద్దో గొప్పో ప‌రువు నిలుపుకోవ‌డానికి, అక్క‌డి బ‌లిజ‌ల‌- ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఓట్ల‌ను పొంద‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను కాసేపు మున‌గ చెట్టు ఎక్కిస్తున్నారు క‌మ‌లం పార్టీ నేత‌లు. ఇదంతా కేవ‌లం ఉప ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్త‌య్యే వ‌ర‌కే అని, ఈ ఫ‌లితాల్లో గ‌నుక నోటాను దాట‌క‌పోతే ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అభ్య‌ర్థి అనే ప్ర‌క‌ట‌నకు కూడా ప్ర‌జ‌ల తిర‌స్కారం ఎదుర‌యిన‌ట్టే అవుతుంది. 

ఆ సంగ‌త‌లా ఉంటే.. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థిగా కొత్త పేరు వినిపిస్తోంది. తిరుప‌తి ఉప ఎన్నిక ప్ర‌చారానికి వెళ్లి చాలా క‌ష్ట‌ప‌డేస్తున్న అచ్చెన్నాయుడును సీఎం అభ్య‌ర్థి అంటూ అక్క‌డ కొంత‌మంది నినాదాలు చేస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. 

వారంతా నిమ్మాడ నుంచి తిరుప‌తికి ప్ర‌చార నిమిత్తం వెళ్లిన వారో లేక తెలుగుదేశం పార్టీలో నారా నాయ‌క‌త్వానికి వ్య‌తిరేకత నేప‌థ్యంమో కానీ.. తిరుప‌తి  అర్బ‌న్ లో అచ్చెన్నాయుడు కాబోయే సీఎం అంటూ కొన్ని నినాదాలు వినిపించగా, వీటిని వెంట‌నే అక్క‌డున్న నేత‌లు క‌ట్ట‌డి చేశార‌ట‌.

తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం అధ్య‌క్ష ప‌ద‌విని పొందిన‌ప్ప‌టి నుంచి అచ్చెన్నాయుడు  సొంత మార్కు వేయాల‌నే ప్ర‌య‌త్నాల‌ను చాలా చేస్తూ వ‌స్తున్నారు. అయితే వాటికి ఎక్క‌డిక్క‌డ చంద్ర‌బాబు నాయుడు బ్రేకులు వేస్తూ ఉన్న వైనం కూడా వార్త‌ల్లో నిలుస్తోంది. పార్టీ ఏపీ విభాగం అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కిన వెంట‌నే రాష్ట్ర‌మంతా ఒక రౌండ్ వేయ‌డానికి అచ్చెన్న ప్ర‌య‌త్నించ‌గా చంద్ర‌బాబు నాయుడు అభ్యంత‌రం చెప్పార‌ట‌.

ఇక తాజాగా ప్రాదేశిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ నుంచి తెలుగుదేశం పార్టీ త‌ప్పుకోవ‌డంతో నారా నాయ‌క‌త్వం పై వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లుతూ ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో పార్టీ యాక్టివిస్టులు అచ్చెన్న‌ను న‌మ్ముకోవ‌చ్చు. చంద్ర‌బాబు నాయుడు ప‌లాయ‌న‌వాదిగా మార‌డంతో పోరాడే వారే కావాల‌నే కోరిక‌తో అచ్చెన్నాయుడును సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకుంటూ ఉండ‌వ‌చ్చు!