ఒకవైపేమో పవన్ కల్యాణ్ సీఎం కావాలంటూ ఆయన అభిమానులు పరితపిస్తుంటే.. ఆయన ఎవరికో మద్దతుగా ప్రచారం చేస్తూ ఉంటారు! ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కో జెండా పట్టుకు కనిపిస్తారు పవన్. ఒకసారేమో చంద్రబాబు జెండా, మరోసారి ఎర్ర జెండా, ఇంకోసారి కాషాయ జెండా.. ఇలా సపోర్ట్ సేనగా మారిపోయింది జనసేన పరిస్థితి.
కనీసం తిరుపతి ఉప ఎన్నికలో.. బలిజల జనాభా గణనీయంగా ఉన్న చోట అయినా జనసేన సత్తా చూపించాలని పవన్ అభిమానులు కోరుకున్నారు. అయితే.. చివరకు ఆ టికెట్ ను కూడా బీజేపీ తీసుకుంటే పవన్ కల్యాణ్ ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలా ఎంతసేపూ ఎవరో ఒకరికి భజన చేయడమే జనసేన రాజకీయ పయనంగా మారింది.
ఆ సంగతలా ఉంటే.. ఇంతలో జనసేన గుర్తు గాజు గ్లాసు కూడా చేజారింది. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా గాజుగ్లాసు గుర్తు ఒక పార్టీకి దక్కింది. తిరుపతి బరిలో జనసేన లేకపోయినా గాజుగ్లాసు గుర్తు మాత్రం బరిలో నిలుస్తోంది. కేవలం రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే అయిన జనసేన గత ఎన్నికల్లో రాష్ట్రమంతటికీ కలిసి గాజుగ్లాసు గుర్తును తెచ్చుకుంది.
ఇక ఎన్నికల్లో సీట్లను తెచ్చుకుని రికగ్నైజ్డ్ పార్టీగా మారి , గాజుగ్లాసు గుర్తును సొంతం చేసుకోలేకపోయింది జనసేన. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బరిలో నిలవని తిరుపతి బై పోల్ లో టీ గ్లాసు గుర్తును మరో పార్టీకి కేటాయించింది ఎన్నికల కమిషన్.
నవతరం పార్టీ అభ్యర్థికి గాజుగ్లాసు గుర్తు దక్కింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్నట్టుగా.. తిరుపతిలో జనసేన బరిలో నిలవనందుకు కాదు, తమది అనుకున్న గుర్తును కూడా ఇప్పుడు మరో అడ్రస్ లేని పార్టీ తన్నుకుపోవడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పరిస్థితి దయనీయంగా మారింది.
ఇన్నాళ్లూ తమ గుర్తు గాజుగ్లాసు అన్నట్టుగా ఏ టీ స్టాల్ కు వెళ్లినా గాజుగ్లాసుల్లోనే టీ అడిగి తీసుకుని పొంగిపోయారు. దాన్ని ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా మార్చుకున్న వాళ్లూ చాలా మంది! ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు గాజుగ్లాసు కూడా చేజారడంతో జనసేన పిల్లకాయలు అల్లాడి పోతున్నారు. వారికి వస్తున్న ఈ చిత్రవిచిత్రమైన కష్టాలు పవన్ కల్యాణ్ నాయకత్వ ప్రతిభకు తార్కాణంగా మారాయి.