తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తమ పార్టీల స్థితిగతులపై అధినేతలకు ఓ అవగాహన వస్తోంది. ముఖ్యంగా వరుస విజయాలతో అన్ని చోట్లా, అంతా బాగుందనుకుంటున్న అధికార పార్టీకి తిరుపతి పార్లమెంట్ పరిధిలోని గూడూరు నియో జక వర్గం షాక్ ఇస్తోంది.
వైసీపీకి గూడూరు నియోజకవర్గం ఇప్పటికీ కంచుకోటే. ఇందులో మరోమాటకు తావు లేదు. కానీ ఎమ్మెల్యే వరప్రసాద్ వైఖరితో నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలుగా పార్టీ చీలిపోవడం అధిష్టానానికి ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తోంది.
ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గానికి ఇన్చార్జ్గా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిని పార్టీ నియమించింది. ఎన్నికల గోదాలోకి దిగిన తర్వాతే పార్టీలో నెలకున్న అసమ్మతి లోతు ఏంటో మంత్రి అనిల్, ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి అర్థమైందంటున్నారు. గ్రామ, మండల స్థాయి నేతలను లెక్క చేయని ఎమ్మెల్యే వరప్రసాద్ వైఖరితో పార్టీకి బాగా నష్టం కలిగిస్తోందన్న ఆందోళన నెలకుంది.
ఎక్కడైనా, ఎవరైనా అధికార పార్టీలోకి ప్రతిపక్ష నేతలు చేరడం చూశాం. కానీ గూడూరులో అందుకు భిన్నమైన పరిస్థితి రెండు రోజుల క్రితం కళ్లకు కట్టింది. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం. అది కూడా కీలకమైన తిరుపతి ఉప ఎన్నిక ముంగిట ఈ పరిణామం సహజంగానే పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రతిబింబిం చింది.
హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌తో గూడూరు ప్రజలకు సేవలందిస్తూ ప్రజాదరణ పొందిన నేత పార్టీని వీడడం, అలాగే మరికొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలొస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ నియోజకవర్గంలో దళితులు, రెడ్డి సామాజిక వర్గానికి ఓటర్లు క్రియాశీలకం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజక వర్గం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 45 వేల ఓట్లతో గెలుపొందారు. కేవలం పార్టీని చూసే ఓటర్లు ఆదరించారు. ఇప్పుడు కూడా ఓటర్లతో సమస్య లేదు.
కేవలం నాయకత్వ సమస్యతోనే పార్టీకి ఇబ్బంది కలుగుతోందన్న అభిప్రాయాలున్నాయి. ఇక్కడ టీడీపీ నామమాత్రమైంది. ఈ నేపథ్యంలో పార్టీలోని లుకలుకలను ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.