ప‌వ‌న్‌పై పులివెందుల కోపం

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న క‌డ‌ప జిల్లా పులివెందుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్ష పార్టీలకు అల‌వాటుగా మారింది. ముఖ్యంగా క‌డ‌ప జిల్లా, అందులోనూ పులివెందుల వాసుల‌ను రౌడీలుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నాల‌ను చంద్ర‌బాబు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న క‌డ‌ప జిల్లా పులివెందుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్ష పార్టీలకు అల‌వాటుగా మారింది. ముఖ్యంగా క‌డ‌ప జిల్లా, అందులోనూ పులివెందుల వాసుల‌ను రౌడీలుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నాల‌ను చంద్ర‌బాబు గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా చేస్తున్నారు. 

త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అయిన వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని దెబ్బ తీసేందుకు నాడు చంద్ర‌బాబు ప‌దేప‌దే పులివెందుల ప్రాంతాన్ని దౌర్య‌న్య‌కారులకు నిల‌యంగా ప్ర‌స్తావించేవారు. ఇప్పుడు జ‌గ‌న్‌పై కూడా అదే పంథాను కొన‌సాగిస్తున్నారు.

చంద్ర‌బాబు మార్గాన్నే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా అనుస‌రిస్తున్నారు. తిరుప‌తిలో శ‌నివారం నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పులివెందుల‌పై ప‌వ‌న్‌కల్యాణ్ నోరు పారేసుకున్నారు. 

పులివెందుల  అసాంఘిక శ‌క్తుల అడ్డా అనే రీతిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ నేప‌థ్యంలో పవ‌న్‌పై పులివెందుల వాసులు మండిప‌డుతున్నారు. త‌మ ప్రాంతంపై అవాకులు చెవాకులు పేలిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై పులివెందుల మున్సిప‌ల్ చైర్మ‌న్ వ‌ర‌ప్ర‌సాద్‌, కౌన్సిల‌ర్లు, వైసీపీ నేత‌లు పులివెందుల అర్బ‌న్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

పులివెందుల ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై చర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో కోరారు. అనంత‌రం వారు విలేక‌రుల‌తో మాట్లాడుతూ పులివెందుల గడ్డ అంటేనే ప్రేమ, అభిమానాలకు, పౌరుషానికి పుట్టినిల్లు  అన్నారు. 

ఏపీకి ఇద్ద‌రు మంచి ముఖ్య‌మంత్రుల‌ను అందించిన ప్రాంతంగా పులివెందుల గుర్తింపు పొందిన‌ట్టు చెప్పారు. ప్యాకేజీల‌కు అమ్ముడుపోయిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు పులివెందుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ పులివెందుల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి!