చర్య తీసుకోకుంటే… నాటకాలడుతున్నట్లే!

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హాట్ హాట్ రాజకీయ వాతావరణం నేపథ్యంలో.. ఇక్కడి ప్రజలకు ఇతర ప్రాంతాలకు చెందిన ఇతరత్రా ‘హాట్-కాని’ అంశాలను పట్టించుకొనే తీరిక తక్కువే ఉంటుంది. అలాంటి వాటిలో మహాత్మా గాంధీ సాగించిన…

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హాట్ హాట్ రాజకీయ వాతావరణం నేపథ్యంలో.. ఇక్కడి ప్రజలకు ఇతర ప్రాంతాలకు చెందిన ఇతరత్రా ‘హాట్-కాని’ అంశాలను పట్టించుకొనే తీరిక తక్కువే ఉంటుంది. అలాంటి వాటిలో మహాత్మా గాంధీ సాగించిన స్వాతంత్ర్య పోరాటాన్ని అవమానిస్తూ భాజపా ఎంపీ అనంతకుమార్ హెగ్డే మాట్లాడడమూ, అలాంటి కొందరు వ్యక్తుల్ని ‘మహాత్మా’ అని ఎందుకు పిలుస్తున్నారో తెలియదంటూ.. ఈసడించడమూ కూడా ఒకటి!

ఈ వ్యాఖ్యల మీద భాజపా పార్టీ జారీచేసిన తాకీదుకు సమాధానం ఇస్తూ హెగ్డే… తాను గాంధీజీ పేరు కూడా ఎత్తలేదని, ఆయనను అవమానించినట్లు మాట్లాడాననడం సరికాదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఇది అత్యంత పెద్ద బుకాయింపు సంజాయిషీ! దీని మీద గనుక పార్టీ కేంద్ర నాయకత్వం సక్రమంగా స్పందించి.. అనంతకుమార్ హెగ్డే మీద కనీస చర్యలైనా తీసుకోకపోతే.. వారు నాటకాలాడుతున్నట్లే భావించాల్సి ఉంటుంది.

ఇంతకూ అనంతకుమార్ హెగ్డే ఏం అన్నారు…

‘‘ఈ నాయకులనబడే వాళ్లంతా పోలీసుల చేతిలో ఒక్కరోజు కూడా దెబ్బలు తినలేదు. వారి స్వాతంత్ర్య పోరాటం పెద్ద డ్రామా. అది నిజాయితీగల పోరాటం కాదు, బ్రిటిషు అనుమతితోనే సాగింది.. కాంగ్రెసుకు మద్దతిచ్చేవాళ్లు ఆమరణ నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలతో స్వాతంత్ర్యం వచ్చిందని అంటుంటారు. అది నిజం కాదు. సత్యాగ్రహం వల్ల బ్రిటిషు వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి పోలేదు. ఇలాంటి నాయకులు మనదేశంలో  మహాత్ములు అయిపోయారు’’ అని హెగ్డే వ్యాఖ్యానించారు.

ఆయన సంజాయిషీలో పేర్కొన్నది నిజమే. ఆయన గాంధీజీ పేరెత్తలేదు. కానీ ఈ మాటల ద్వారా ఆయన ఏం చెప్పడానికి సాహసించారో అందరికీ అర్థమవుతూనే ఉంది. బాధ్యతగల భాజపా ఎంపీ ఇలాంటి దుడుకు మాటలు మాట్లాడడం ఏ రకంగానూ సరికాదు. ఆయన మీద చర్య తీసుకోకపోతే భాజపా నాయకత్వం కూడా.. మాయ మాటలతో.. మొక్కుబడి తాకీదులతో ప్రజలను, గాంధీని అభిమానించే వారిని మోసం చేయడానికి పూనుకుంటున్నట్టే లెక్క.

అసలే మోడీ గద్దెనెక్కిన తర్వాత జాతీయోద్యమంలో గాంధీ పాత్రను తక్కువ చేసి.. ఇతర హీరోలను పెంచిచూపే  కుట్ర జరుగుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇప్పుడు హెగ్డే వ్యాఖ్యలపై భాజపా సరైన చర్య తీసుకోకపోతే అవి నిజమే అని నమ్మవలసి వస్తుంది.

విజయ్ కు మాత్రమే సరిపోయే కథ ఇది