తను డిప్యూటీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అంటున్నారు కర్ణాటక మంత్రి శ్రీరాములు. గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన శ్రీరాములు కర్ణాటకకు డిప్యూటీ సీఎం కావాలనే డ్రీమ్స్ తో ఉన్నారు. యడియూరప్ప ప్రభుత్వం ఏర్పడినప్పుడే శ్రీరాములుకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే అది జరగలేదు. మంత్రి పదవి అయితే ఇచ్చారు కానీ, డిప్యూటీ సీఎం పదవి మాత్రం దక్కలేదు. వేరే వాళ్లు ముగ్గురు ఆ హోదాను పొందారు.
ఇక యడియూరప్ప కేబినెట్ విస్తరణకు సమయం వచ్చినట్టుంది. ఫిబ్రవరి ఆరో తేదీన విస్తరణ అని ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా పది మంది మంత్రులు చేరనున్నారని తెలుస్తోంది. ఇదే ఊపులో తనకు డిప్యూటీ సీఎం హోదా కావాలని శ్రీరాములు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది ప్రజల కోరిక అని ఆయన అంటున్నారు.
ఎస్టీ కోటాలో కూడా శ్రీరాములు తన డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు. ఒక దశలో ఈయన కర్ణాటక బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అనేంత స్థాయిలో ప్రచారం జరిగింది. చివరకు వైద్య శాఖా మంత్రి పదవి లభించింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాను ఆయన గట్టిగానే కోరుకుంటున్నట్టున్నారు. అందుకు బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?