భారతీయ జనతా పార్టీలో ఇదివరకు ఒక మంచి సంప్రదాయం ఉండేది. శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారు ముందుగానే ప్రకటించేవారు. ఎవరి సారథ్యంలో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోతున్నామో ముందే చెప్పి.. అప్పుడు ఓట్లను అభ్యర్థించేవాళ్లు. ఇదంతా.. వారికి సిద్ధాంతాలు ఉన్న రోజుల్లోని మాట. ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ముఖ్యమంత్రిని సీల్డు కవర్ లో పంపే కాంగ్రెస్ సంస్కృతికి ఈ తరహా చాలా భిన్నంగా ఉండి ప్రజలను ఆకట్టుకుంది. వారికి నమ్మకం కలిగించింది. అయితే ఇప్పుడు మోడీ జమానాలో భాజపాలో కూడా రోజులు మారాయి. సీఎం అభ్యర్థిని సీల్డు కవర్ లోనే పంపుతున్నారు. ముందుగా ప్రకటించే ధైర్యం లేకుండాపోతోంది.
సరిగ్గా ఆ కీలకమైన అంశం దగ్గరే భాజపాను ఇరుకున పెట్టడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అస్త్ర సంధానం చేస్తున్నారు. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండి. వారితో నేను బహిరంగ చర్చకు సిద్ధం అని సవాలు విసురుతున్నారు. ఇది ఆ పార్టీని ఖచ్చితంగా ఇరుకునపెట్టే విషయం. అందుకే కేజ్రీ ఆ మాటెత్తుతున్నారు.
భాజపా పరిస్థితి ఇదివరకటి లాగా లేదు. సీఎంను ముందు చెప్పే పద్ధతి లేదు. అవకాశవాద, వ్యక్తిపూజ రాజకీయాలు ఆ పార్టీలో కూడా పుష్కలంగా జోరందుకుంటున్నాయి. ఇలాంటి బలహీనతలను రచ్చకీడ్చడానికి కేజ్రీవాల్ చేసిన సవాలు ఉపయోగపడుతోంది.
నరేంద్రమోడీ మాత్రం.. ఢిల్లీ వాసులకు అభివృద్ధి భరోసా ఏమీ చెప్పకుండా.. అచ్చంగా ఎన్నార్సీ, పౌరసత్వ చట్టం, 370 అధికరణం గురించి మాత్రమే ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్నారు. బుజ్జగింపుల ప్రభుత్వం వద్దు అని కేజ్రీపై నిందలేస్తున్నారు. రైతులకు ఏటా సొమ్ము చెల్లిస్తున్న మోడీ సర్కారు బుజ్జగింపుల మాటేమిటి? అది మాత్రం ఎలా మంచి పథకం అవుతుంది. మోడీ వైఖరి చూడబోతే.. తాముచేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం సామెతను గుర్తు చేస్తున్నట్లుగా ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఓడితే.. మరి ఆయన చెబుతున్న దేశభద్రత నిర్ణయాల పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన ఒప్పుకుంటారా? అనే సందేహాలు ప్రజలలో మెదలుతున్నాయి.