ఇద్దరు శ్రీనులు. ఒక్కటే సీటు పొలిటికల్ ఫైట్ ఈసారి చాలా ఆసక్తిగా ఉంటుందని అంటున్నారు. ఆ ఇద్దరు శ్రీనులు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఒకరు టీడీపీకి చెందిన సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అయితే మరొకరు వైసీపీకి చెందిన సీనియర్ నేత అవంతి శ్రీనివాసరావు.
ఈ ఇద్దరూ ఒకనాడు స్నేహితులు. ఇపుడు రాజకీయంగా ప్రత్యర్ధులు. ఇద్దరి మధ్యన భీమిలీ సీటే చిచ్చు పెట్టింది. 2019లో భీమిలీ నుంచి పోటీ చేయాలని అప్పటి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు చూస్తే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా మళ్లీ నేనే అంటూ వచ్చారు.
ఈ ఇద్దరి పోరుని తీర్చలేక టీడీపీ అధినాయకత్వం సతమతమైంది. ఈ లోగా అవంతి తన దారి తనది అంటూ వైసీపీలోకి దూకేయడం భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడం చకచకా జరిగిపోయాయి. గంటాకు కూడా భీమిలీ సీటు దక్కలేదు. ఆయనకు నార్త్ కేటాయించారు.
ఇపుడు గంటా చూపు భీమిలీ మీద ఉంది అని అంటున్నారు. 2024లో భీమిలీ నుంచి గెలిచి పార్టీ విజయం సాధిస్తే మరోమారు మంత్రి కావాలని గంటా చూస్తున్నారు. అవంతి విషయానికి వస్తే ఆయనకు భీమిలీ టికెట్ ఖాయం. అంతకంటే బలమైన నేత లేరు. దాంతో ఇద్దరు శ్రీనుల మధ్య భీమిలీ వేదికగా పోలిటికల్ వార్ జరగనుందా అన్నది ఇపుడు హాట్ డిస్కషన్ గా ఉంది. ఈ ఇద్దరూ పోటీ పడితే ఒకనాటి మిత్రులు ప్రత్యర్ధులుగా కత్తులు దూస్తే భీమిలీ వైపే అందరి చూపు ఉంటుంది.
ఇద్దరూ సమ ఉజ్జీలే. ఇద్దరూ బలమైన సామాజికవర్గానికి చెందిన వారే. ఇద్దరూ భీమిలీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన వారే. దాంతో ఈ పోరు రసవత్తరం అని ప్రచారంలో ఉన్న ఈ వార్తను చూసిన వారు అంతా అంటున్నారు. నిజంగా అనుకున్నట్లుగా ఫైట్ జరిగితే కూల్ భీమిలీ హీటెక్కిపోవడం ఖాయం అంటున్నారు.