రేవంత్ మాటలే భారాసకు బ్రహ్మాస్త్రాలు!

తమ తమ ప్రత్యర్థులను తూలనాడడానికి, చిన్న పాయింటు దొరికితే చాలు.. దాన్ని పట్టుకుని తెగఅల్లుకుపోవడం అనేది రాజకీయనాయకుల శైలి. అలాంటిది స్వయంగా ప్రత్యర్థే తమ చేతికి అస్త్రాలను అందిస్తే విడిచిపెడతారా? అలాంటి ప్రయత్నంలోనే ఉన్నది…

తమ తమ ప్రత్యర్థులను తూలనాడడానికి, చిన్న పాయింటు దొరికితే చాలు.. దాన్ని పట్టుకుని తెగఅల్లుకుపోవడం అనేది రాజకీయనాయకుల శైలి. అలాంటిది స్వయంగా ప్రత్యర్థే తమ చేతికి అస్త్రాలను అందిస్తే విడిచిపెడతారా? అలాంటి ప్రయత్నంలోనే ఉన్నది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి. 

తెలంగాణ కాంగ్రెస్ సారథి రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్తు గురించి చేసిన వ్యాఖ్యలనుంచి పూర్తిస్థాయిలో రాజకీయ లాభం పొందాలని అనుకుంటున్నది. ఆయన మాటలనే కాంగ్రెస్ పార్టీని పరాజయం పాల్జేయడానికి బ్రహ్మాస్త్రంలాగా ప్రయోగించాలని అనుకుంటున్నది.

తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం మంది రైతులకు రోజుకు మూడు గంటల ఉచిత విద్యుత్తు చాలు.. అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారుతున్నాయి. ఆ మాటలను సమర్థించుకోవడానికి తన మాటలను వక్రీకరించారని నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి నానా పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనే కొందరు ఈ మాటలను ఖండించగా, మరికొందరు రేవంత్ ను తప్పుపట్టకుండానే, అసలు ఉచిత విద్యుత్తు అంటేనే కాంగ్రెస్ పార్టీకి పేటెంటు ఉన్న అంశం అంటూ.. పార్టీని కీర్తిస్తున్నారు.

అదే సమయంలో భారాస మాత్రం.. కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. అన్నదాతలకు ఉచిత విద్యుత్తు ఆగిపోతుంది.. అనేంత స్థాయిలో రైతుల్లో భయాలను వ్యాప్తి చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు జరిగాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలం చర్చజరిగే ఉద్యమంగా మార్చడానికి తగినట్టుగా కేటీఆర్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

రాష్ట్రంలో ప్రతి రైతు వేదిక వద్ద రైతులతో సమావేశాలు నిర్వహించాలని, ప్రతి సమావేశానికి కనీసం వెయ్యి మంది రైతులు హాజరయ్యేలా చూసుకోవాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించారు. ‘భారాస ఇస్తున్న మూడుపంటలు కావాలా.. కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంటు కావాలా’ అనే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లాలంటున్నారు. 

కాంగ్రెసు పార్టీ వస్తే ఉచిత విద్యుత్తు రద్దయిపోతుందనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నారు. ప్రతి ఇంటిలోనూ కాంగ్రెసు వస్తే ఉచిత విద్యుత్తు రద్దు అనే భయాన్ని వ్యాపింపజేసేలా భారాస సుదీర్ఘ ప్రణాళిక రచించుకున్నట్టు కనిపిస్తోంది.

పనిలో పనిగా.. చంద్రబాబు కూడా రైతువ్యతిరేకి అనే ప్రచారానికి పూనుకుంటున్నారు. తెలంగాణలో మళ్లీ బోణీ కొట్టాలని అనుకుంటున్న తెలుగుదేశానికి అశనిపాతం లాగా, చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అన్నారని, ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉచిత విద్యుత్తు తొలగిస్తున్నారని అంటూ భారాస సాగించే ప్రచారం.. కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశానికి కూడా ఎంతో కొంత నష్టం కలిగిస్తుంది.