రోజాపై జగన్ సానుభూతి ఆవిరైపోనుందా?

ఏ పార్టీ అయినా సరే.. ఎన్నికల్లో విజయం మాత్రమే తమ మొదటి లక్ష్యంగా భావిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్దస్థాయిలో అభ్యర్థులు మార్పు చేర్పులు చేసినా కూడా.. వాటి వెనుక ఏకైక లక్ష్యం…

ఏ పార్టీ అయినా సరే.. ఎన్నికల్లో విజయం మాత్రమే తమ మొదటి లక్ష్యంగా భావిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్దస్థాయిలో అభ్యర్థులు మార్పు చేర్పులు చేసినా కూడా.. వాటి వెనుక ఏకైక లక్ష్యం ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం మాత్రమే. టికెట్ల కేటాయింపు, అభ్యర్థిత్వాల విషయంలో జగన్ చాలా కరాఖండీగా వ్యవహరిస్తున్నారనే సంగతి స్పష్టంగానే కనిపిస్తోంది.

తమ కుటుంబానికి ఎంతో దగ్గరి వ్యక్తిగా పేరున్నప్పటికీ కూడా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టడమే ఇందుకు ఉదాహరణ. ఇంత మొండిగా, నిక్కచ్చిగా ఉంటున్న జగన్ కూడా కొందరి విషయంలో సానుభూతితో లేదా రాజీ పడుతూ వ్యవహరిస్తున్నారనే పేరుంది.

అలాంటి వారిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. అభ్యర్థుల మార్పు చేర్పులు ప్రారంభం అయిన నాటినుంచి రోజాకు ఈసారి టికెట్ దక్కబోదనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. రోజా పట్ల నగరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల్లో విపరీతమైన అసంతృప్తి ఉంది. వారందరూ కూడా ఇప్పుడు కాదు కదా.. ఎన్నాళ్ల నుంచో ఆమెను వ్యతిరేకిస్తున్నారు. పైగా జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా రోజాకు వైరం ఉంది.

ప్రస్తుతం అభ్యర్థిత్వాల మార్పు చేర్పుల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కీలకంగా చక్రం తిప్పుతున్నారు. ఇలాంటి సమయంలో రోజాకు ఇక టికెట్ దక్కదనే ప్రచారాన్ని వ్యతిరేకులు ప్రారంభించారు.

రోజా మాత్రం ఈ ప్రచారంపై పలు సందర్భాల్లో ఆచితూచి స్పందించారు. జగనన్న ఎలా ఆదేశిస్తే అలా చేస్తానని అన్నారు. టికెట్ దక్కేది లేనిది జగన్ నిర్ణయిస్తారని అన్నారు. అయితే వ్యతిరేకతను తోసిరాజని రోజా పట్ల జగన్ కొంత సానుభూతితో ఉన్నారని, ఆమెకు టికెట్ కొనసాగించే ఉద్దేశం ఉన్నదని మధ్యలో తాడేపల్లి వర్గాల నుంచి వినిపించింది.

అభ్యర్థుల మార్పుచేర్పుల విషయంలో మూడోజాబితాలోనే శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల విషయం ఉండవలసినదే గానీ.. రోజా పట్ల సానుకూల ధోరణితోనే జగన్ ఆమెను మార్చలేదని వినిపించింది. ఒకరకంగా రోజా పట్ల జగన్ సానుభూతితో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.

అయితే జగన్ లోని ఆ సానుభూతిని కూడా హరించివేసి.. రోజాకు టికెట్ దక్కగల అవకాశాలను పూర్తిగా మృగ్యం చేయడానికి ఆమె వ్యతిరేకులు నియోజకవర్గంలో చాలా గట్టిగానే పనిచేస్తున్నారు. రోజాకు దాదాపు నగరి నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో ఉన్న సొంత పార్టీ నాయకులతో విభేదాలు ఉన్నాయి. ఆమె ఒంటెత్తు పోకడలు అనుసరిస్తోందన్నది వారి వాదన. జగన్ స్వయంగా రోజాను విబేదించే నాయకురాలు కేజే శాంతి చేయి పట్టుకుని.. రోజాతో సహా ఇద్దరి చేతులు కలిపి కలిసి పనిచేయాలని చెప్పడానికి చేసిన ప్రయత్నం కూడా గతంలో ఫలించలేదు.

అంతగా రోజాను ద్వేషిస్తున్న వారంతా ఇప్పుడు స్వరం పెంచుతున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటున్నారు. వీరిలో కొందరు కీలక నాయకుల వెనుక మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలం కూడా ఉన్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఇంత వెల్లువలాంటి వ్యతిరేకత ఉండగా.. రోజాకు టికెట్ సందేహమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.