నేడో రేపో ఆ నలుగురిపై వేటు తథ్యం!

తెలుగుదేశానికి చెందిన గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఇంచుమించుగా  మూడేళ్ల కిందట గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. తాజాగా…

తెలుగుదేశానికి చెందిన గంటా శ్రీనివాసరావు హఠాత్తుగా మాజీ ఎమ్మెల్యే అయిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఇంచుమించుగా  మూడేళ్ల కిందట గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. తాజాగా మంగళవారం నాడు స్పీకరు ఆ రాజీనామాను ఆమోదించారు. దీంతో శాసనసభలో తెలుగుదేశం ఎమ్మెల్యేల బలం ఒకటి తగ్గింది.

నిజానికి విశాఖ నార్త్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా మర్చిపోయారు. తీరా ఇప్పుడు ఆయన పదవి పూర్తిగా ఊడింది.

గంటా రాజీనామా చేసినది 2021 ఫిబ్రవరి 12న! అప్పట్లో ఆయన తెలుగుదేశం పార్టీతో కూడా అంటీముట్టనట్టుగా ఉండేవారు. ఆయన ఇతర పార్టీల్లోకి ఫిరాయించడానికి పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా ఉంది. ఆ సమయంలో ఆయన రాజీనామా చేశారు. కానీ దాని ఆమోదం గురించి స్పీకరు తమ్మినేని సీతారాం ఇన్నాళ్లూ పట్టించుకోలేదు.

ఇటీవలి కాలం వరకూ తెలుగుదేశంతో అంటీముట్టనట్టుగానే ఉన్న గంటా, ఇప్పుడిప్పుడే మళ్లీ పార్టీ స్వరానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఆయనపై వేటు పడింది. త్వరలో జరగనున్న ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ ఎంపీ ఎన్నికల విషయంలో తెలుగుదేశానికి ఒక్క సీటైనా దక్కే అవకాశం లేదుగానీ.. ముందు జాగ్రత్తగా వారి బలాన్ని పరిమితం చేయడానికే ఈ రాజీనామా ఆమోదించారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

ఇదే సమయంలో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత.. పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఫిర్యాదులు ఎదుర్కొంటున్న మరో తొమ్మిదిమంది ఎమ్మెల్యేలకు కూడా స్పీకరు నోటీసులు సర్వ్ చేశారు. వారందరూ వారం రోజుల్లోగా వచ్చి తమ వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇలాంటి ఫిరాయింపు కారణంగా వేటు వేయడానికి తగినవిధంగా నోటీసులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలలో తెలుగుదేశానికి చెందిన నలుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన నలుగురు, జనసేన పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు.

వీరిలోనూ.. తెలుగుదేశం, జనసేన వారికి కూడా నోటీసులు వెళ్లినప్పటికీ.. వారిపై వేటు పడే అవకాశం తక్కువే అనేది విశ్లేషకుల అభిప్రాయం. అదే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై మాత్రం తప్పకుండా వేటు పడుతుందని అంచనా వేస్తున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో ఎలాంటి లొసుగులు లేకుండా.. మొత్తం మూడు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే వ్యూహంతోనే ఇప్పుడు హడావుడిగా ఈ కసరత్తు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.