రామమందిరం.. మొదటి రోజు పోటెత్తిన భక్తగణం

అయోధ్యలో కొలువుదీరిన బాలారాముడ్ని దర్శించుకునేందుకు మొదటి రోజు భక్తులు పోటెత్తారు. ఈరోజు నుంచి సామాన్య భక్తులకు, శ్రీరాముడి దర్శనాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అయోధ్య నుంచే కాకుండా.. లక్నో, బారాబంకి, గోండా, బహరిచ్, ఉన్నావ్, గోరఖ్‌…

అయోధ్యలో కొలువుదీరిన బాలారాముడ్ని దర్శించుకునేందుకు మొదటి రోజు భక్తులు పోటెత్తారు. ఈరోజు నుంచి సామాన్య భక్తులకు, శ్రీరాముడి దర్శనాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అయోధ్య నుంచే కాకుండా.. లక్నో, బారాబంకి, గోండా, బహరిచ్, ఉన్నావ్, గోరఖ్‌ పూర్ లాంటి పొరుగు జిల్లాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకున్నారు.

ఉదయం 7 గంటల నుంచి రాముడి దర్శనానికి అనుమతి. కానీ భక్తులు మాత్రం ఉదయం 3 గంటల నుంచే ఆలయం ముందు క్యూ కట్టారు. అంచనాకు మించి వచ్చిన భక్తుల్ని నియంత్రించడం భద్రతా సిబ్బంది వల్ల కాలేదు. ఒక దశలో బారికేడ్లు తోసుకుంటూ భక్తులు ముందుకు కదలడంతో స్పల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఫలితంగా మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలకు అనుమతి ఇవ్వలేదు. మొదటి రోజు రాముడ్ని లక్షా 50వేల మంది దర్శించుకున్నట్టు ట్రస్ట్ తెలిపింది. ఈ సందర్భంగా భక్తులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 వరకు దర్శనం కోసం రావొద్దని, ఆ సమయంలో ఆలయం మూసివేసి ఉంటుందని తెలిపిన ట్రస్ట్.. శ్రీరాముడి విగ్రహానికి పండ్లు, పాలు సమర్పించవచ్చని అంతకుమించి ఇంకేవీ విగ్రహం వద్ద పెట్టకూడదని సూచించింది.

పేరు మార్పు… నిన్నటివరకు అయోధ్యలో కొలువుదీరిన దేవుడ్ని రామ్ లల్లాగా సంభోదించారు. కానీ ఇప్పుడు స్వామివారి పేరు మారింది. బాలుడి రూపంలో రాముడు కొలువుదీరాడు కాబట్టి 'బాలక్ రామ్'గా సంభోదించాలని ట్రస్ట్ కోరింది. ఈ మేరకు అయోధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

అలంకరణలు.. శ్రీరాముడి వస్త్రధారణపై కూడా ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. సోమవారం ధవళవర్ణపు వస్త్రాల్లో దర్శనమిస్తారు రాములోరు. ఇక మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం లేత పసుపు, శనివారం నీలం రంగు, ఆదివారం గులాబీ రంగు దుస్తుల్లో కనువిందు చేస్తారని ప్రకటించింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పూర్తిగా పసుపు వర్ణంలో స్వామివారు కనిపిస్తారని స్పష్టం చేసింది. వస్త్రాలంకరణతో పాటు ఆభరణాల్లో కూడా మార్పులు ఉంటాయని, ప్రస్తుతానికైతే ఆభరణాల విషయంలో నియమాలు పెట్టుకోలేదని తెలిపింది.