ఎన్నికల వేళ సమస్యగా మారిన అంగన్వాడీల సమ్మెకు ఏపీ సర్కార్ పరిష్కారం చూపింది. 42 రోజులుగా తమ డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఇరువైపులా పట్టింపులకు పోవడంతో సమస్య జఠిలమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు ఆందోళనకారులతో చర్చలు జరిపింది.
తక్షణం జీతాల పెంపు డిమాండ్ మినహా మిగిలిన పది సమస్యల పరిష్కారానికి ఏపీ సర్కార్ ముందుకొచ్చింది. దీంతో అంగన్వాడీలు సమ్మె విరమించినట్టు ప్రకటించారు. మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు తెలిపారు. అంగన్వాడీలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. జూలై నుంచి వేతనాలు పెంపునకు ఇటు అంగన్వాడీలు, హెల్పర్లు , అటు ప్రభుత్వం అంగీకారానికి వచ్చారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వర్కర్లకు రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. పదవీ విరమణ వయస్సు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. ప్రమోషన్లకు 45 నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వ పెద్దలు అంగీకరించారు.
అలాగే సమ్మె కాలంలో వేతనం ఇవ్వడానికి అంగీకరించారు. పోలీసు కేసులను ఎత్తి వేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తూ ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూల స్పందన తెలియజేయడంతో పరిష్కారం లభించింది.