ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రక్రియను జగన్ వేగవంతం చేశారు. ఇప్పటికే 50కి పైగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన చోట్ల కూడా త్వరగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు. అయితే ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ రాంగ్ రూట్‌లో వెళుతున్నారనే అభిప్రాయం సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. బాగున్నవి కూడా మార్చి ఎందుకు చెడగొడుతున్నారో అర్థం కావడం లేదనే ఆవేదన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.
ఎంపీ అభ్యర్థుల విషయంలో జగన్ చుట్టూ ఉండే ముగ్గురు నలుగురు కీలక నేతలు అసలు విషయాలు దాచి, అంతా మంచి కోసమే చెబుతున్నట్టుగా నటిస్తూ, తప్పుదోవ పట్టిస్తున్నారనే చర్చకు తెరలేచింది. నరసారావుపేట, తిరుపతి, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, చిత్తూరు తదితర లోక్‌సభ స్థానాల్లో సిటింగ్‌లను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమైంది. పోనీ మార్చిన చోట, సిటింగ్‌ల కంటే మెరుగైన నాయకులను ఎంపిక చేశారంటే, జగన్ నిర్ణయాన్ని స్వాగతించొచ్చని అంటున్నారు.
నరసారావుపేట, రాజమండ్రి, తిరుపతి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, మార్గాని భరత్, డాక్టర్ మద్దిల గురుమూర్తి యువకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపన ఉన్న నాయకులు. అందుకే తమ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకున్నారు.
ఇలాంటి వాళ్లను మరింతగా ప్రోత్సహిస్తే రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీగా నిధులు రాబడుతారు. ఇది వైసీపీకి, రాష్ట్రానికి మేలు. నరసారావుపేట ఎంపీని గుంటూరుకు వెళ్లాలని చెప్పడంతో ఆయన ససేమిరా అన్నారు. దీంతో నరసారావుపేట నుంచి కృష్ణదేవరాయులు పోటీ పెండింగ్‌లో పడింది. ఒకవేళ నరసారావుపేట టికెట్ ఇవ్వకపోతే ఆయన ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకోడానికి రెడీ అయ్యారు. తద్వారా మంచి నాయకుడిని వైసీపీ పోగొట్టుకున్నట్టు అవుతుంది.
అలాగే మార్గాని భరత్‌ను రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా, గురుమూర్తిని సత్యవేడుకు పంపి వైసీపీ చాలా నష్టపోవడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డిని ఎందుకు వద్దనుకున్నారో జగన్‌కే తెలియాలి. అలాగే వివాదాలకు దూరంగా ఉండే కర్నూలు, చిత్తూరు ఎంపీలు సంజీవ్‌కుమార్, రెడ్డెప్పలకు ఎంపీ టికెట్లు నిరాకరించడం వెనుక వ్యూహం ఏంటో అర్థం కాదు.
వైసీపీ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే … ఎమ్మెల్యేలుగా తీవ్ర వ్యతిరేకత ఉందనే కారణంతో మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా, అలాగే డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని తిరుపతి ఎంపీగా పంపాలని అనుకోవడం అధికార పార్టీకే చెల్లింది. ప్రజా వ్యతిరేకత ఉన్న వారికి అసలు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్లను పక్కన పెట్టి, కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చి వుంటే సమాజం హర్షించేది. అందుకు విరుద్ధంగా ప్రమోషన్ కల్పించడమే విడ్డూరం.
బాగా పని చేసుకునే ఎంపీలను మార్చేసి ఏవేవో ప్రయోగాలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ మార్పులను పరిశీలిస్తే జగన్ చేజేతులా కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారనే వాదన బలపడుతోంది. ఇప్పటికైనా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై జగన్ పునరాలోచన చేస్తే వైసీపీకే మంచిది. లేదంటే ఆయన పార్టీ, ఆయక ఇష్టం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాప్రయోజనం వుండదు.