మాటెత్తితే చేగువేరా అయిపోయాడు, భగత్ సింగ్ అయిపోయాడు, దేశపు జెండా అంతటి పొగరు.. ఇలాంటివన్నీ అయిపోయాయి! ఇప్పుడు చేయగలిగింది చంద్రబాబు బానిసత్వం తప్ప జనసేనానికి ఇంకో దశ, దిశ లేదు! చంద్రబాబు ఇచ్చినన్ని సీట్లను పుచ్చుకుని ఆయనకు కట్టుబానిసలా పని చేయడం తప్ప పవన్ కల్యాణ్ పదేళ్ల రాజకీయానికి సార్థకత లేదు!
మరి రేపు చంద్రబాబు ఇచ్చిన పదోపరక సీట్లలో అయినా జనసేన తరఫున పోటీ చేసేది ఎవరు? చంద్రబాబు పంపిన వాళ్లే కదా! ఇందులో ఏమైనా, ఎవరికైనా సందేహాలున్నాయా? తనతో పొత్తుకు ముందుకు వచ్చిన వాళ్లకు మొదట్లో ఎంత చమురు రాయాలో అంత రాసి, మర్ధనా చేసి.. చివరకు మీ అభ్యర్థుల జాబితా బాగోలేదంటూ తను చెప్పిన మేరకు మార్పులు చేయాలంటూ ఒత్తిళ్లు తీసుకురావడం చంద్రబాబుకు కొత్త కాదు! ఎక్కడ పోటీ చేయాలో తనే చెబుతారు, ఎవరు పోటీ చేయాలో కూడా తనే చెబుతారు! చివరకు అలా పోటీ చేసిన వారిపై టీడీపీ రెబల్స్ ను బరిలోకి ఆయనే దింపుతారు, అదీ కాదంటే ఆ రెబల్స్ కే టీడీపీ బీఫారం ఇస్తారు! అదేమంటే.. మీ క్యాండిడేట్ వీక్ అంటారు!
మహామహా పార్టీలే చంద్రబాబు నుంచి ఇలాంటి చిక్కులను ఎదుర్కొని విలవిల్లాడాయి! ఇదేమీ ఎప్పటి చరిత్రో కాదు! పాత పత్రికలు తిరగేస్తే అర్థమయ్యేంత చరిత్ర, అనేకమందికి తెలిసిన సంగతి! మరి రేపు చంద్రబాబు రాజముద్ర పడితే తప్ప జనసేన అభ్యర్థుల జాబితా బయటకు కూడా రాదు! ఇదీ వీరావేశపు అభినవ భగత్ సింగ్ పవన్ కల్యాణ్ రాజకీయం పరిస్థితి!
తన పార్టీ తరఫున నిలబడిన పంచాయతీ ప్రెసిడెంట్లు 70 మంది సంతకాలు పెట్టి ఒక అనామకుడి పేరును పంపిస్తే.. తను ముక్కూమొహం చూడని ఆ వ్యక్తిని జగన్ అభ్యర్థిగా ప్రకటించాడు! అతడు గెలుస్తాడా? ఓడతాడా? కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ నియోజకవర్గంలో డెబ్బైమంది ప్రెసిడెంట్ల మాటకు దక్కిన విలువ ఇది!
పుష్కరకాలం కిందట పుట్టిన ఒక ప్రాంతీయ పార్టీలో.. పంచాయతీ ప్రెసిడెంట్ల తీర్మానానికి అనుగుణంగా ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించడం అంటే.. ఇది చిన్న విషయం కాదు! కేరళ కమ్యూనిస్టు పార్టీల్లో కూడా ఇలాంటి సన్నివేశం ఉండదు! కేవలం మడకశిరే కాదు.. మరి కొన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ క్యాడర్ తీర్మానానికి అనుగుణంగా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తోంది!
మరి పవన్ సారు మాటలు ఎన్నో కోటలు దాటుతూ ఉంటాయి. ఆఖరికి చిరంజీవి కూడా తుపాకుల మనెమ్మ అని ఒక సామాన్యురాలిని తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించుకోగలిగారు 2009లో! మరి తలెత్తితే తనది జాతీయ జెండా అంతటి పొగరు అని చెప్పుకునే పవన్ కల్యాణుడు రేపటి ఎన్నికల కోసం ఎక్కడైనా తన అభ్యర్థిగా ఒక సామాన్యుడిని ప్రకటించగలరా? లేదా తన పార్టీ క్యాడర్ తీర్మానం చేసి పంపితే ఎవరైనా సామాన్యుడిని అభ్యర్థిగా ఆమోదించగలరా?
అంత ధైర్యం, అంత తెగువ ఉన్నాయా? అలా చేస్తే చంద్రబాబు జనసేన తోక కట్ చేయడా? చంద్రబాబు కనుసన్నలను దాటేంత సీన్ పవన్ కు కానీ, జనసేనకు కానీ ఉన్నాయా? నువ్వెంత జగన్, నువ్వెవరు జగన్ అంటూ గొంతుచించుకునే పవన్ కు చంద్రబాబు బానిసత్వం తప్ప ఇంకో గత్యంతరం ఉందా?