వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలోకి వెళ్లారు. ఆయనకు విశాఖ జనసేన ప్రెసిడెంట్ పదవిని ఇచ్చారు. విశాఖ సిటీలో వైసీపీ నుంచి నేతలను జనసేనలోకి తీసుకుని రావాలంటూ పెద్ద బాధ్యతను ఆయన మీద పెట్టారని అంటున్నారు.
పార్టీలో చేరిన కొత్తలో వంశీ మీడియా ముందుకు వచ్చి భారీ ప్రకటన చేశారు ఉత్తరాంధ్రా వైసీపీని ఖాళీ చేస్తామని చెప్పారు. జీవీఎంసీ మేయర్ పదవికే ముప్పు తెచ్చేలా కార్పోరేటర్లు తమ వైపు పెద్ద ఎత్తున అధికార పార్టీ నుంచి వస్తారని కూడా జోస్యం చెప్పారు.
సంక్రాంతి తరువాత వైసీపీని ఏమీ కాకుండా చేస్తామని వంశీ అన్నారు. సంక్రాంతి పండుగ ముగిసి వారం అయింది. డెడ్ లైన్ అయిపోయిన నేపధ్యంలో వైసీపీ నుంచి కొంతమంది మహిళలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా వంశీ మీడియా ముందుకు వచ్చారు.
తొందరలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు జనసేనలోకి వస్తారు అని మరోమారు చెప్పారు. వారందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువాలు కప్పి మరీ పార్టీలోకి తీసుకుంటారు అని వంశీ అంటున్నారు. వైసీపీ పతనం ప్రారంభం అయిందని జనసేనదే రాజ్యం అని ఆయన అంటున్నారు.
వంశీ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. ఆయనకు విశాఖ తూర్పు టికెట్ ఇవ్వలేదని పార్టీ మారారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయనకు జనసేన అయినా తూర్పు టికెట్ ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఇపుడు వైసీపీ నాయకులు ఏమి దక్కుతుందని జనసేనలోకి వెళ్తారు అని అడుగుతున్నారు. వంశీ వరకూ అయితే వైసీపీ నుంచి బడా నేతలనే జనసేనలోకి తేవాల్సి ఉంది అంటున్నారు. వైసీపీలో నుంచి వెళ్లే బడా నాయకులు ఎవరూ అని కూడా ఆలోచిస్తున్న వారు ఉన్నారు.