నటుడు సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ లో చేరాడు. ముంబయిలోని కోకిలాబెన్ హాస్పిటల్ వైద్యులు, అతడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తాజా సమాచారం ప్రకారం, సైఫ్ మోచేతికి సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది.
ఓ షూటింగ్ లో సైఫ్ గాయపడ్డాడు. వెంటనే అతడ్ని హుటాహుటిన హాస్పిటల్ లో చేర్చారు. అయితే ఇది కొత్త గాయం కాదు. గతంలోనే రంగూన్ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు సైఫ్. అదే గాయం ఇప్పుడు మరోసారి తిరగబెట్టింది. దీంతో సర్జరీ తప్పలేదు.
తనకు సర్జరీ అయినట్టు, అంతా సజావుగా సాగినట్టు 53 ఏళ్ల సైఫ్ ప్రకటించాడు. అయితే ఏ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడనే విషయాన్ని అతడు వెల్లడించలేదు.
తెలుగులో దేవర సినిమాలో నటిస్తున్నాడు సైఫ్. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ లోనే అతడు గాయపడ్డాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు.
సర్జరీ చేయించుకున్న సైఫ్, 3 వారాల పాటు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గొనకూడదని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అతడి సర్జరీ, దేవర షూటింగ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ప్రస్తుతానికి తెలియదు. వేసవి కానుకగా.. ‘దేవర పార్ట్ 1’ను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.