ఆంధ్ర రాజకీయం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా కనిపిస్తోంది. జగన్ ఒక్కడూ ఒక వైపు. పార్టీలు, జెండాలు సంబంధం లేకుండా మిగిలిన పార్టీలు అన్నీ ఒక వైపు. షర్మిల నేరుగా జగన్నే తిడతారు. ఇప్పటి వరకు సాగిన కాంగ్రెస్ పాలనను కానీ చంద్రబాబు పాలన గురించి కానీ మాట్లాడరు. పవన్ కళ్యాణ్ సంగతి సరే సరి. జగన్ నే టార్గెట్. చంద్రబాబు మూడు టెర్మల పాలన విషయాలు పొరపాటున కూడా ప్రస్తావించరు. వామపక్షాలు సంగతి తెలిసిందే. బాబుగారు ఏమంటే అదే మాట. భాజపా సంగతి మరీ చిత్రం. ఆ పార్టీ కేంద్ర నాయకులు చోద్యం చూస్తున్నట్లు చూస్తుంటారు. లోకల్ లీడర్లు జగన్ మీద ఎగబడతారు.
సో మొత్తానికి జగన్ పార్టీ మినహా రాజకీయంలో ప్రవేశం వున్న పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిళ్లు కావచ్చు, మీడియా కావచ్చు అందరికీ ఒక్కరే టార్గెట్.. వైఎస్ జగన్. గమ్మత్తేమిటంటే ఈ జనాలు అంతా గడచిన అయిదేళ్ల పాలన గురించే మాట్లాడతారు. అంతకు ముందు మూడు టెర్మ్ లు పని చేసి చంద్రబాబు చేసిన దాని గురించి మాట్లాడతారు. చంద్రబాబు పాలన గురించి మాట్లాడాలంటే సైబరాబాద్ అంటూ బాకా బయటకు తీస్తారు. పోనీ అలా అని జగన్ చేసిన వంద పనుల్లో ఒక్కటైనా మంచి పని వీరికి కనిపిస్తుందా అంటే కనిపించదు.
ఇదంతా ఓ సామాజిక వర్గం అద్భుతంగా అల్లిన సాలెగూడు. ఆ అల్లిక నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అది షర్మిల అయినా పవన్ కళ్యాణ్ అయినా. ఎక్కడెక్కడో పావులు కదులుతాయి. ఎవరెవరో పందాలు నప్పుతారు. ఫలితం ఎవ్వరూ ఊహించని విధంగా భటులు నడుస్తారు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ, దానికి ఓ సలహాదారు. సదరు సలహాదారు ‘మనవాడే’. ఆ మాత్రం చాలు కదా అల్లుకుపోవడానికి. అక్కడ ఆ విధంగా తమ కార్యక్రమాలు నెరవేర్చుకున్నారు.
ఎక్కడ అసంతృప్తి వుంటే అక్కడ వల వేసారు. సామ, దండో పాయలతో పని లేదు. దానో పాయం వుండనే వుందిగా. పైగా జగన్ తీరు వేరు. ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి అనే టైపు. అందరినీ దూరం చేసేసుకున్నారు. బతిమాలే ప్రసక్తే లేదు. బామాలే ఊసే లేదు. అస్సలు లౌక్యం తెలియదు అనుకోవాలో? అస్సలు రాజకీయం వంటపట్టలేదు అనుకోవాలో. మరింక ఏం ధీమా వుందో? మొత్తానికి తన వైరి గణాన్ని జగన్ తనే బలోపేతం చేసారు.
నిజానికి దగ్గుబాటి ఫ్యామిలీకి కావాల్సినవి చూసి వుంటే ఈ రోజు పురందేశ్వరి ఇలా మాట్లాడే పరిస్థితి వుండేది కాదు. అప్పడే చెల్లెలికి రాజ్యసభ ఇచ్చేసి వుంటే ఈ రోజు ఇలా ప్రశ్నించుకునే అవసరం వుండేది కాదు. ఇలా ఎవరికి కావాల్సిన బిస్కెట్లు, రొట్టెముక్కలు ఇచ్చుకుంటూ పోతే ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రం ఇలా వుండేది కాదు.
కానీ అన్నీ అనుకుంటే అక్కడ వున్నది జగన్ ఎందుకవుతారు? అనితర సాధ్యం నా మార్గం అన్నట్లు సాగుతున్నారు. ఇక మిగిలంది ఒక్కటే ఆశ జగన్ కు. తను ఇన్నాళ్లూ ఇన్ని మాటలు పడి, ఇన్ని అప్పులు చేసి, ఇంత అపప్రధ మూట కట్టుకుని పంచిన డబ్బులు అక్కరకు వచ్చి ఆదుకుంటాయా? ఆదుకోవా?
అయినవారు, కాని వారు అంతా శతృవులై ఎదురు నిలిచిన వేళ, జనం ఏమంటారు? డబ్బులు ఇచ్చినా, పంచినా కూడా తాము కూడా ఎదురుగానే వుంటాము తప్ప పక్కన వుండము అంటారా? అంతకన్నా దురదృష్టం జగన్ కు మరోటి వుండదు. అపజయాన్ని కౌగిలించుకోవడానికి సిద్దం అయిపోవడమే.
కానీ ఇది కాదు సమస్య. జగన్ గెలవచ్చు. ఓడొచ్చు. అది వేరే సంగతి. కానీ ఆ వర్గం అల్లిన సాలెగూడులో చిక్కుకున్నవారందరికీ తరువాత ఎలాగూ కనువిప్పు అవుతుంది. కానీ ఒకసారి మళ్లీ అధికారం చేతిలోకి వచ్చిన తరువాత ఇక మరి కొన్ని దశాబ్దాలు ఆ వర్గం గుప్పిట్లో ఆంధ్ర జనం అల్లాడాల్సిందే. మళ్లీ మరోసారి జగన్ లాంటి మరొకరు రారు. రాలేరు. రానివ్వదు ఆ వర్గం.