అయోధ్యలో భవ్యరామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రేపట్నుంచి సామాన్య భక్తులకు అయోధ్యలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆలయం టైమింగ్స్ తో పాటు, ఇతర వివరాల్ని వెల్లడించారు.
అయోధ్యలోని రామ్ లల్లాను ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు దర్శించుకోవచ్చు. ఆ తర్వాత స్వల్ప విరామం ఇచ్చి, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు.
ఈ మేరకు టికెట్ బుక్ చేసే వివరాల్ని కూడా వెల్లడించారు. ఆలయం సమీపంలో టికెట్ తీసుకోవచ్చు. లేదా ముందుగానే ప్లాన్ చేసుకుంటే.. ఆన్ లైన్ లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రాలేదు.
రాబోయే రోజుల్లో టికెట్లలో మార్పుచేర్పులు ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా హారతి సమయంలో ఈ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఆలయంలో రోజూ ఉదయం 6.30కి జాగరన్ హారతి ఇస్తారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30కు సంధ్యా హారతి ఉంటుంది.
అయోధ్యకు అత్యథిక విరాళం ఇచ్చిన వ్యక్తి.. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి దాదాపు మూడేళ్లుగా విరాళాలు అందుతూనే ఉన్నాయి. వీటిలో అతిపెద్ద విరాళాన్ని ట్రస్ట్ బయటపెట్టింది. సూరత్ కు చెందిన దిలీప్ కుమార్ అనే వజ్రాల వ్యాపారి రామమందిరానికి భారీ విరాళం ఇచ్చారు.
రామ మందిరానికి ఈ వ్యాపారి ఏకంగా 101 కిలోల బంగారాన్ని విరళంగా సమర్పించారు. ఈ బంగారాన్నే రామాలయ గర్భగుడి తలుపుల్ని తాపడం చేశారు. మిగిలిన బంగారాన్ని కొన్ని స్తంభాలతో పాటు, ఇతర అలంకరణ సామగ్రికి ఉపయోగించారు. ప్రస్తుతం మార్కెట్ వాల్యూ ప్రకారం దిలీప్ ఇచ్చిన విరాళం విలువ 68 కోట్ల రూపాయలకు పైమాటే.
ఈ హీరోయిన్ అయోధ్యలోనే పుట్టిందంట.. ఇక రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాజాగా కోడలు హోదాలో మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టిన ఈ హీరోయిన్, అయోధ్యలో పుట్టిందంట. ఆ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. అయోధ్యలో పుట్టిన తను, ఈరోజు శ్రీరాముడి ప్రాణప్రతిష్టను చూడడంతో తన జీవితం ధన్యమైందని అభిప్రాయపడింది.