యాభై ఏళ్ల ప్రయాణం ఓ అదృష్టం

‘’నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 50 ఏళ్ళు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా ప్రేక్షకులు ప్రేమాభిమానాలు వలనే సాధ్యమౌతోంది. నా జీవితాంతకాలం సినీ పరిశ్రమకు సేవ చేస్తాను’’ అన్నారు…

‘’నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 50 ఏళ్ళు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా ప్రేక్షకులు ప్రేమాభిమానాలు వలనే సాధ్యమౌతోంది. నా జీవితాంతకాలం సినీ పరిశ్రమకు సేవ చేస్తాను’’ అన్నారు సీనియర్ నటుడు నరేష్. నటుడిగా నరేష్ సినీ ప్రయాణం మొదలై విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలు.

– ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిందల్లా కృష్ణ , విజయనిర్మల ల మేకప్ రూమ్, పొద్దున్నే వచ్చి కలిసే ప్రజలు, స్టూడియో వాతావణం.. ఇలా వీటి చుట్టూనే పెరిగాను. ఇదే నా జీవితం కావాలని కోరుకున్నాను. తొమ్మిదోయేట 'పండంటి కాపురం' లాంటి అద్భుతమైన చిత్రంతో ఆరంగేట్రం చేశాను. ఒక్క సినిమా హీరోగా నటిస్తే చాలని అనుకున్నాను. అనుకోకుండా..ప్రేమ సంకెళ్ళు, జంధ్యాల గారి నాలుగు నాలుగు స్తంభాలాట..ఇలా రెండు సినిమాలు వచ్చాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో జంధ్యాల , విశ్వనాథ్ , బాపు , ఈవీవీ సత్నారాయణ , వంశీ లాంటి మహనీయులతో కలసి పని చేసే అదృష్టం దొరికింది.

ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం ప్రయత్నించాను. నేను రీల్, రియల్ లైఫ్ లో కొంచెం అడ్వెంచరస్ పర్శన్ ని. రిస్కులు తీసుకుంటాను, నా మనసుకి నచ్చింది చేస్తాను. కొంత కాలం రాజకీయాల్లో పని చేశాను. తర్వాత సోషల్ సర్విస్ లోకి వచ్చాను. ఈ క్రమంలో దాదాపు పదేళ్ళు పాటు పరిశ్రమకి దూరమయ్యాను. సెకండ్ ఇన్నింగ్స్ పలు వైవిధ్యమైన పాత్రలు వచ్చినపుడు నటుడు ఎస్వీ రంగారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని చేశాను. వివిధ్యమైన పాత్రలు రావడంతో నాకు పరిశ్రమలో కొత్త మెరుగు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త, వైవిధ్యమైన రావడం అనందంగా వుంది. ఈ సందర్భంగా దర్శక, రచయితలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఒక నటుడు పదేళ్ళు ఉండటమే గొప్ప. 50 ఏళ్లు గడపడం ఆనందంగా వుంది. గత ఏడాది సామజవరగమన నాకు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది. లీడ్ రోల్ లో చేసిన మళ్ళీ పెళ్లి తో పాటు ఓటీటీలో చేసిన ఇంటింటి రామాయణం, మాయాబజార్ మంచి విజయాలు సాధించాయి. ఇన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.

రాజకీయాల్లోకి ఒక సేవాభావంతో వెళ్లాను. అప్పటి ఇప్పటికీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితిలో అటు డైవర్ట్ కావడం కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వమైన సినీ పరిశ్రమకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటాను. నంది అవార్డులని పరిశ్రమ చాలా గౌరవంగా చూస్తుంది. కానీ ఇప్పుడా అవార్డులని ప్రధానం చేయడం లేదు. ఒక తరం నటులు ఆ అవార్డులని చూడలేదు. నంది అవార్డు వేడుకని మళ్ళీ పునర్ నిర్మించాలని కోరుకుంటున్నాను అన్నారు నరేష్.