గోరంతను కొండంతలుగా చేసి చూపించడం.. ఆ మేరకు ప్రచారంలో లబ్ధిని ఆశించడం రాజకీయాల్లో చాలా మామూలు సంగతి. ప్రభుత్వం పట్ల ప్రజల్లోని కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చే ఏ చిన్న అంశం కనిపించినా.. దానిని బ్లోఅప్ చేసి.. ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రతిపక్షాలు ఉత్సాహపడుతుంటాయి. ఇది కూడా సహజం. కానీ.. అందులో కొంత విచక్షణ చూపించాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు భారాస నేత కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే.. ఆయన ఆ ఔచిత్యం మిస్ అవుతున్నారని అనిపిస్తోంది. వ్యతిరేకత, ఒక వేళ ఉంటే దానిని మరికాస్త ఎగదోయడాన్ని అర్థం చేసుకోవచ్చు గానీ.. దాని వలన అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకునేలా ప్రేరేపించే ప్రకటనలు చేయడం మాత్రం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి నాటి నుంచే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. సహజంగానే కిటకిటలాడే పండగలు, పబ్బాల సమయంలో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటోంది.
అయితే.. ఈ ఉచిత ప్రయాణం వలన ఆటోవాలాల ఉపాధి దెబ్బతింటోందనేది భారాస వాదన. అతిశయంగా.. ఆటో నడిపే ప్రతి ఒక్కరికీ నెలకు రూ.15 వేల భృతి ఇవ్వాలనే డిమాండ్ ను కూడా భారాస తెరమీదికి తెచ్చింది. అయితే ఇప్పుడు కేటీఆర్ .. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఆయన మాటలు ఆటో వాలాలను ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉచిత ప్రయాణం వలన.. ఆటో డ్రైవర్ల ఉపాధి అడుగంటా పడిపోయిందనే వాదన అర్థరహితం. ఇప్పటికీ ఆటో వ్యాపారం కొంత తగ్గి ఉండొచ్చు గానీ.. తగుమాత్రం స్థాయిలో పుష్కలంగానే నడుస్తూ ఉంది. అయితే ఆ వర్గాన్ని రెచ్చగొట్టడానికి గులాబీ నాయకులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
ఆటోవాలాల ఆత్మహత్యల వలన సమస్య పరిష్కారం అయిపోతుందని అన్నట్టుగా లేదా, ఆటో వారికి ఆత్మ హత్య తప్ప వేరే మార్గమే లేదన్నట్టుగా కేటీఆర్ అంటున్న మాటలు నిజమే అనుకుని.. బలహీన మనస్కుడైన ఏ ఆటోవాలానో ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరిది బాధ్యత. కేవలం అధికారం కోసం ఆరాటపడడం, అధికారం దక్కకపోతే.. దక్కించుకున్న వారి మీద విరుచుకు పడడం మాత్రమేనా.. తమకు సామాజిక బాధ్యత ఉందని కేటీఆర్ వంటి నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రజలు విమర్శిస్తున్నారు.