చిరంజీవి వారసుడైతే.. బాల‌య్య ఏం కావాలి?

దివంగ‌త ఎన్టీఆర్‌కు న‌ట‌న‌లో ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌, రాజ‌కీయంలో చంద్ర‌బాబునాయుడు వార‌సుడ‌ని వారికి వారే తీర్మానించుకున్నారు. వృద్ధాప్యంలో ఎన్టీఆర్ యోగ‌క్షేమాలు ఏ ఒక్క‌రూ చూసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న ల‌క్ష్మీపార్వ‌తిని వివాహం చేసుకున్నార‌ని అంటుంటారు.…

దివంగ‌త ఎన్టీఆర్‌కు న‌ట‌న‌లో ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌, రాజ‌కీయంలో చంద్ర‌బాబునాయుడు వార‌సుడ‌ని వారికి వారే తీర్మానించుకున్నారు. వృద్ధాప్యంలో ఎన్టీఆర్ యోగ‌క్షేమాలు ఏ ఒక్క‌రూ చూసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న ల‌క్ష్మీపార్వ‌తిని వివాహం చేసుకున్నార‌ని అంటుంటారు. ఎన్టీఆర్‌కు ఆయ‌న వార‌సులు బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ త‌దిత‌రులు అండ‌గా నిల‌బ‌డ‌క‌పోగా, ఆయ‌న‌కు తీర‌ని దుఃఖాన్ని మిగిల్చిన త‌న‌యులుగా మిగిలిపోయారు.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్ వార‌స‌త్వంపై వైసీపీ ఎంపీ లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయులు చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. విశాఖ‌లోని రుషికొండ‌లో ఎన్టీఆర్ వ‌ర్ధంతి, అలాగే ఏఎన్నార్ జ‌యంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో న‌ర‌సారావుపేట ఎంపీ కృష్ణ‌దేవ‌రాయులు మాట్లాడుతూ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల‌కు సినిమాల ప‌రంగా నిజ‌మైన వార‌సుడు మెగాస్టార్ చిరంజీవి అని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్త‌డం విశేషం.

చిరంజీవి న‌ట‌న‌తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు వ‌చ్చింద‌న్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవిని ఏ ఒక్క వ‌ర్గానికి ప‌రిమితం చేయొద్ద‌ని లావు కృష్ణ‌దేవ‌రాయులు విజ్ఞ‌ప్తి చేశారు. ఇదే స‌మావేశంలో చిరంజీవి మాట్లాడుతూ ప్ర‌జాసేవ త‌ప్ప‌, సంపాద‌న‌పై ధ్యాస లేని ఎంపీగా కృష్ణ‌దేవ‌రాయులు త‌న‌కు క‌నిపించార‌ని ప్ర‌శంసించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు త‌న‌కు దైవ స‌మానుల‌న్నారు. వారితో క‌లిసి న‌టించ‌డం త‌న పూర్వ‌జ‌న్మ సుకృతం అని చిరంజీవి చెప్పారు.

ఇదిలా వుండ‌గా ఎన్టీఆర్‌కు చిరంజీవి న‌ట వార‌సుడ‌ని వైసీపీకి చెందిన ఎంపీ కామెంట్ చేయ‌డం బాల‌య్య అభిమానుల‌కు రుచించ‌దు. చిరంజీవిపై గ‌తంలో బాల‌య్య అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఇప్పుడు త‌న‌ను కాకుండా చిరంజీవిని తండ్రికి వార‌సుడిగా అభివ‌ర్ణించ‌డాన్ని బాల‌య్య ఏదో ఒక సంద‌ర్భంలో కామెంట్ చేస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.