‘జమిలి’ అటకెక్కినట్లేనా?

ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు నిర్వహించేలాగా, పార్లమెంటుకు అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలాగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీవ్రమైన కసరత్తు చేస్తోంది. Advertisement…

ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు నిర్వహించేలాగా, పార్లమెంటుకు అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలాగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీవ్రమైన కసరత్తు చేస్తోంది.

ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా నియమించింది. జమిలి ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకొని తదనుగుణంగా ఎలా ముందుకు వెళ్లాలో కార్యాచరణ రూపొందించడం ఈ కమిటీ బాధ్యత. అయితే భాజపాయేతర పార్టీల నుంచి వస్తున్న స్పందనను గమనిస్తే జమిలి ఎన్నికల ప్రతిపాదన అసలు పట్టాలు ఎక్కుతుందా లేదా అనే అనుమానం పలువురికి కలుగుతోంది. ఇలాంటి ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమైనది అనే వాదన వ్యతిరేకించే వారి వైపు నుంచి వస్తోంది.

ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికల ఆలోచనను తిరస్కరిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు ఒక లేఖ రాస్తూ జమిలి ఎన్నికల ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎన్నికల ఖర్చులు ఆదా చేయడం ఒక్కటే పరమార్థంగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారని నిజానికి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆమాత్రం ఎన్నికల ఖర్చును భరించగలిగే శక్తి మన దేశానికి ఉందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

జమిలి ఎన్నికలు అనేవి రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తికి, సమాఖ్య వాదానికి విరుద్ధంగా ఉందని ఖర్గే అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అలాగే డిఎంకె వంటి మరికొన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

జమిలి ఎన్నికల వలన.. జాతీయ పార్టీలకు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు ఎడ్వాంటేజీ ఉంటుందనేది ఒక వాదన. ఇలాంటి వాటివల్ల.. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా దెబ్బతింటాయని, ప్రాంతీయ పార్టీల ఉసురు తీయడానికే బిజెపి ఈ ఆలోచన చేస్తున్నదని ఆరోపణలున్నాయి. అదే సమయంలో.. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు.. ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం గెలిచిన ప్రభుత్వాన్ని కూలదోయడం అస్థిరత ఏర్పడడం అనేది ఈ రోజుల్లో చాలా సహజంగా మారిపోయింది. ఎంత మెజారిటీతో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి.

ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలి.. ఎవ్వరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే గనుక.. ఆ తర్వాతి అయిదేళ్లకు మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటుంది. ఇది అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధం అని.. దేశాన్ని నెమ్మదిగా నియంతృత్వంవైపు నడిపించేకుట్రతో ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ని పార్టీలు వ్యతిరేకిస్తుండగా.. రాజ్యాంగం వ్యతిరేకం అనే వాదన తెస్తుండగా.. జమిలి ఎన్నికల ప్రతిపాదనపై ముందుకు వెళ్లడం అంత ఈజీ కాదని పలువురు విశ్లేషిస్తున్నారు.