పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి టీడీపీలోనూ కష్టకాలం ఎదురయ్యే వాతావరణం కనిపిస్తోంది. పెనమలూరు సిటింగ్ ఎమ్మెల్యే అయిన పార్థసారథికి రానున్న ఎన్నికల్లో జగన్ టికెట్ నో అన్నారు. దీంతో ఆయన ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. సహజంగానే ఆయన టీడీపీని ఎంచుకున్నారు. ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ నెల 21న టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు.
ఇదే సందర్భంలో పెనమలూరు టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రూపంలో ఆయనకు ఇబ్బంది ఎదురు కానుంది. టీడీపీలో పార్థసారథి చేరికపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు టికెట్‌ను పార్థసారథి ఆశించడంలో తప్పు లేదన్నారు. అయితే టీడీపీ అధిష్టానం టికెట్ ఎవరికో తేలుస్తుందన్నారు. అయితే సారథికి టిడీపీ టికెట్ ఇస్తే, సహకరించే విషయమై నిర్ణయం చెబుతానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్ల పాటు పార్థసారథి చేతల్లో తమ వాళ్లు కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. అందుకే పార్థసారథికి టికెట్ ఇవ్వొద్దని తమ వాళ్లు డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. పార్థసారథి నాయకత్వంలో పని చేయడం టీడీపీ కార్యకర్తలకు ఇష్టం లేదని ఆయన అన్నారు. పార్థసారథి చేరికపై ఇప్పుడే తాను ఏమీ మాట్లాడనన్నారు.
పార్థసారథికి టికెట్ ఇవ్వరనే నమ్మకం బోడె ప్రసాద్‌కు ఉండడం వల్లే ఆయన గురించి మాట్లాడనని అంటున్నారు. ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రం ఆయన మద్దతు ఇవ్వరని బోడె మాటలు తెలియజేస్తున్నాయి. పార్థసారథి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా వుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.