తెలంగాణ సమాజానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గృహజ్యోతి పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో జనవరి నెలకు సంబంధించి విద్యుత్ బిల్లులను ఎవరూ చెల్లించవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ అహంకారంతో మాట్లాడిన రేవంత్ లాంటి నాయకుల్ని బీఆర్ఎస్ ఎన్నో చూసిందని చెప్పుకొచ్చారు. అలాంటి నేతలంతా మఖలో పుట్టి పుబ్బలో పోయేవాళ్లని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలనేవి కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ పథకాన్ని నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవేళ విద్యుత్ అధికారులు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తెస్తే సీఎం రేవంత్ మాటలను చూపించాలని ఆయన సూచించారు. సోనియాగాంధీ బిల్లు కడుతుందని ఎన్నికల ప్రచారంలో రేవంత్ చెప్పారన్నారు. కరెంట్ బిల్లుల్ని సోనియాగాంధీ ఇంటికి పంపాలని ఆయన సలహా ఇచ్చారు. అద్దె ఇళ్లలో ఉండేవారికి కూడా ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే మహాలక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టే ప్రశ్నే లేదని ఆయన హెచ్చరించారు.