చంద్రబాబుని చూసి జాలి పడాలి. అదేంటి అంతటి సమర్ధవంతమైన నాయకుడు, నాలుగు దశాబ్దాల పైన అనుభవమున్న దిగ్గజ నేతని చూసి జాలిపడడం దేనికి అనుకుంటున్నారా? పరిస్థితుల్ని బట్టి అన్నీ మారుతుంటాయి. అలాగే ఇది కూడా.
ఒక్కసారి చంద్రబాబుని జాగ్రత్తగా విశ్లేషించుకుందాం. ఆయన పైకి షసెల్ ఫోన్ నేనే తెచ్చా, హైటెక్ సిటీ నేనే కట్టా, రింగురోడ్ నేనే వేశా, ఎయిర్పోర్ట్ నేనే పెట్టా, తెలంగాణలో చదువు మొదలయింది నేను పెట్టిన స్కూళ్ల వల్లే, అమెరికాలో తెలుగువాళ్లు ఐటీలో ఉద్యోగాలు చేస్తున్నది నా దయ వల్లే..” అంటూ రకరకాలుగా చెప్పుకుపోతుంటారు. ఇందులో ఒక్కటీ నిజం లేదని, అంతా ఆయన తనకి తాను ఆపాదించుకుంటున్నారని అర్ధమవుతూనే ఉంది.
అయినప్పటికీ ప్రపంచం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతోందన్నట్టుగా, భూమి కూడా సూర్యుడి చుట్టూ తాను చెప్పినట్టే పరిభ్రమిస్తోందన్నట్టుగా భ్రమ చెందుతూ మాట్లాడే చంద్రబాబులోని మెగలోమేనియా చేతలకొచ్చేసారికి పూర్తి భిన్నంగా ఉంటోంది.
తన మీద తనకి మితిమీరిన నమ్మకం ఉన్నవాళ్లు ఎవరి సాయం కోరరు. తామే పదిమందికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే ఫీలింగులో ఉంటారు. వీళ్లకి వాస్తవ పరిస్థితులు అనవసరం. తమని తాము లోకం ఏమనుకుంటుందో అనే లెక్కలు కూడా వేసుకోరు. తమ ఆత్మస్థైర్యంతో దూసుకుపోతుంటారు. ఉదాహరణకి కే.ఏ పాల్ ని చూడండి.. మాటలు, చేతలు రెండూ ఒకలాగే ఉంటాయి. తాను సాయం చేస్తానంటుంటే ముఖ్యమంత్రులు, ప్రధానులు పుచ్చుకోరేంటి అనే ధోరణిలో ఉంటాయి. చూసే వాళ్లకి అంతా కామెడీగా ఉన్నా అది మెగలోమేనియాకి నిదర్శనం.
అలాగే మెగలోమేనియా కాకపోయినా తమ మీద తమకి నమ్మకం ఉన్నవాళ్లు ఎవరి సాయం అడక్కుండా పార్టీలు పెట్టేసి బరిలోకి దూకేస్తుంటారు. ఈ మధ్యన బర్రెలక్క అనే ఒక అమ్మాయిని చూసాం. తనకొచ్చిన కొద్దిపాటి సోషల్ మీడియా ఫాలోయింగ్ కావొచ్చు, వ్యక్తిగత కారణం కావొచ్చు సొంత పార్టీ పెట్టుకుని బరిలోకి దిగేసింది. ఎవర్నీ పొత్తులు, మొక్కజొన్నపొత్తులు అడగలేదు.
అలాగే కొత్తగా జేడీ లక్ష్మీనారాయణ. ఈయన కూడా పార్టీ పెట్టేసాడు. సొంతంగా పోటీ చేస్తానంటున్నాడు. మొన్నటి వరకు తెలివైన వ్యక్తిగా కనిపించిన ఈయన కొత్తగా ఈ పిచ్చ గోలేంటి అని ఎందరో అనుకున్నా అది ఆయన మితిమీరిన ఆత్మస్థైర్యానికి నిదర్శనం.
అలాగే ఆ మధ్యన షర్మిల. ఆమె కూడా పార్టీ పెట్టేసి తెలంగాణలో తన సత్తా చాటాలనుకుంది. తర్వాత కథ తెలిసిందే. అయినప్పటికీ అది ఆమెలో పేట్రేగిన ఆత్మస్థైర్యం.
ఇలా గమనిస్తూ పోతే మన చుట్టూ తమ మీద తమకి అక్కర్లేనంత ఎక్కువ నమ్మకమున్న వ్యక్తులు కనిపిస్తూనే ఉన్నారు.
కానీ చంద్రబాబు అలా కాదు. మాటల వరకే ఆయన మెగలోమేనియా. చేతల్లో మాత్రం తెల్లారి లేస్తే పొత్తుల గోలే. ఎప్పుడూ పొత్తు లేకుండా ఆయన ఏ ఎన్నికకీ వెళ్లలేదు.
కొన్నాళ్లు కమ్యూనిష్టుల తొటి, కొన్ని సార్లు బీజేపీ తోటి, ఒక సారి టీఆర్ఎస్ తోటి, మరో సారి ఏకంగా కాంగ్రెస్ తోటీ ఇలా ఎవర్నీ వదలకుండా అందర్నీ పొత్తు భిక్ష పెట్టమని యాచించడమే ఈయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అన్నట్టుంది.
ఆఖరికి ఆ పొత్తులు ఎంతవరకూ వచ్చాయంటే అస్సలు నిబద్ధత లేని పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేనతో పొత్తు!
ఆల్రెడీ సొంతపార్టీతో ఘోరంగా భంగపడి ఇప్పుడు కాంగ్రెస్ నీడలో ఉన్న షర్మిలతో పొత్తు.
అసలు రిలవెంట్‌గా ఉన్నారో లేదో, కనీసం ఎక్కడైనా ఒక్క సీటైనా గెలుస్తారో లేదో తెలియని కమ్యూనిష్టులతో పొత్తు. ఇవి చాలవని బీజేపీతో పొత్తుకి అలుపెరుగని తపస్సు.
చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే చివరికి కే.ఏ పాల్ ప్రజాశాంతి పార్టీని, జేడీ జై భారత్ పార్టీని, పార్టీ ఉన్నా యాక్టివ్ గా లేని జేపీగారి లోక్ సత్తాని, తెలంగాణాలో మాత్రమే ఉన్న బర్రెలక్క పార్టీని కూడా పొత్తో, మద్దతో అడిగేసేలా ఉన్నాడు.
ఇదంతా దేనికంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకుండా తన బుట్టలోనే పడాలట. దానికి ఇదంతా చేసే బదులు నేరుగా వెళ్లి వైకాపాని పొత్తు అడిగేస్తే సరిపోతుందేమో. అసలు కాంపిటీషనే ఉండదప్పుడు!!
వినాశకాలే విపరీత బుద్ధి, కాలం కలిసి రానప్పుడు అన్నీ చచ్చు ఆలోచనలే వస్తాయన్నట్టు చంద్రబాబు ఈ పవన్ తోటి, షర్మిలతోటి పొత్తులు, మద్దతులు పెట్టుకుని చేయగలిగేది ఏముంటుందో తెలియట్లేదు. లాభమేమో కానీ నష్టమే కనిపిస్తోంది.
చంద్రబాబు తన మీద తనకి నిజమైన నమ్మకముండి సోలోగా పోటీ చేసే పద్ధతిలో ఉంటే జనానికి హీరోలా కనపడేవాడు. తన నిర్ణయాలు తన చేతుల్లో ఉండేవి. పొత్తుల వల్లే జీరోలా కనిపించడం, పొత్తుల వల్లే అందర్నీ సంతృప్తి పరచలేక రిబెల్స్ ని తయారు చేసుకోవడం చేస్తున్నాడు. ఈ అయోమయానికి తోడు బీహార్ నుంచి వచ్చిన వ్యూహకర్తలు తమ సలహాలతో, సూచనలతో చంద్రబాబుని ఆడేసుకుంటున్నారు.
ఎవరికి ఏ సీటివ్వలో వాళ్లు చెబుతుంటే దానిని ఫాలో అవ్వాలో వద్దో అర్ధం కాక తికమకపడుతున్నాడు. అందుకే ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదాయన. ఎన్నికలు చూస్తే ముంచుకొస్తున్నాయి. అభ్యర్థుల్ని ఎంపిక చేసి ప్రకటిస్తే వాళ్ల ప్రచారం వాళ్లు మొదలుపెడతారు. చివరాఖర్లో చెప్తానంటే ఎవరికి మాత్రం ప్రచారానికి సమయముంటుంది?!
సొంత కులాన్ని, సొంత మీడియాని, సొంత వ్యవస్థల్ని తప్ప జనాన్ని నమ్ముకోని చంద్రబాబు ఇప్పుడు నడిరోడ్డుల కూడలిలో నలిగిపోతున్నాడు. అందుకే ఆయనని చూస్తే జాలి పడాలనిపిస్తోంది.
ఇన్ని చెప్పుకున్నా… రేపు ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎలా ఉండబోతోందో ఎవరూ చెప్పలేరు. ఒకవేళ ఆ తీర్పు చంద్రబాబుకి విజయం చేకూర్చేలా రాకపోతే మాత్రం లోకం ఆయన్ని పిచ్చిమారాజులాగే చూస్తుంది. ఒక వేళ విజయమొస్తే మళ్లీ చాణక్యుడనే బిరుదుని సొంత మీడియా తగిలిస్తుంది. మళ్లీ చాణక్యుడవుతాడా? లేక పిచ్చిమారాజులాగానే మిగిలిపోతాడా? ఏం జరుగుతుందో చూడాలి.
– హరగోపాల్ సూరపనేని