సంక్రాంతి సినిమాల వసూళ్ల చుట్టూ నడుస్తున్న రచ్చ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. థియేటర్లు ఖాళీగా ఉంటాయి, మరుసటి రోజు భారీ కలెక్షన్లతో పోస్టర్లు దర్శనమిస్తాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న లెక్కలకు, నిర్మాతలు వేస్తున్న పోస్టర్లకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఒకప్పుడు తక్కువ మార్జిన్ లో తేడా ఉండేది, కానీ ఇప్పుడు నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ కనిపిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. సరిగ్గా చెక్ చేసుకోకుండా బాక్సాఫీస్ వసూళ్లను ప్రచురిస్తున్న కొన్ని వెబ్ పోర్టల్స్ కు లీగల్ నోటీసులు అందబోతున్నాయి. ఈ పని చేస్తోంది నిర్మాతలు కాదు, అలా అని ఇండస్ట్రీకి చెందిన ఫిలింఛాంబర్ లాంటి సంస్థలు కూడా కాదు.
తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఈ లీగల్ నోటీసులకు శ్రీకారం చుడుతోంది. అనధికారిక బాక్సాఫీస్ లెక్కల్ని ప్రచురిస్తున్న కొన్ని పోర్టల్స్ కు లీగల్ నోటీసులు పంపాలని వీళ్లు నిర్ణయించారు.
“కలెక్షన్ ను అనధికారికంగా ప్రచురించడం వల్ల ఉత్పన్నమయ్యే చెడు పరిణామాలపై అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది, ఇది ఇన్ కం ట్యాక్స్ దాడులకు దారితీస్తోంది, నిర్మాతల మధ్య సంబంధాలు చెడగొడుతోంది. అభిమానుల మధ్య అనవసరమైన విభేదాలు సృష్టిస్తోంది. సోషల్ మీడియా వేదికల్లో అనుమతి లేకుండా కలెక్షన్ లెక్కల్ని పోస్ట్ చేసిన హ్యాండిల్స్ పరిశీలనలో ఉన్నాయి.” అంటూ అసోసియేషన్ ప్రకటన జారీ చేసింది.
అనధికారిక లెక్కలకు సంబంధించిన మూలాల్ని కనుగొనడంతో పాటు, ఆ లెక్కల్ని ప్రచురించిన సంస్థల్ని బాధ్యుల్ని చేయడమే లక్ష్యంగా ఈ నోటీసులు జారీ చేయబోతున్నట్టు అసోసియేషన్ తెలిపింది.
రీసెంట్ గా గుంటూరుకారం సినిమా వసూళ్లపై నిర్మాత నాగవంశీ స్పందించారు. తను ప్రకటించిన వసూళ్లు ఫేక్ అని భావిస్తే నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ఆయనలా ఛాలెంజ్ చేసిన కొన్ని గంటల వ్యవథిలోనే అసోసియేషన్ ఇలా లీగల్ నోటీసులంటూ ముందుకొచ్చింది.