50 సీట్లు, సీఎం ప‌ద‌విలో భాగం… బాబును భ‌య‌పెడుతున్న కాపులు!

త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిమాండ్లు నెర‌వేర్చుకోడానికి ఇదే స‌రైన స‌మ‌య‌ని ఉద్యోగులు, వివిధ సామాజిక వ‌ర్గాలు భావిస్తున్నాయి. దేవుడికైనా దెబ్బే గురువు అనే సామెత చందాన‌… ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోతామ‌నే భ‌యంతోనైనా రాజ‌కీయ పార్టీలు…

త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిమాండ్లు నెర‌వేర్చుకోడానికి ఇదే స‌రైన స‌మ‌య‌ని ఉద్యోగులు, వివిధ సామాజిక వ‌ర్గాలు భావిస్తున్నాయి. దేవుడికైనా దెబ్బే గురువు అనే సామెత చందాన‌… ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోతామ‌నే భ‌యంతోనైనా రాజ‌కీయ పార్టీలు త‌మ డిమాండ్ల‌కు త‌లొగ్గుతాయ‌నే ఉద్దేశంతో నిర‌స‌న‌ల‌కు దిగ‌డాన్ని చూడొచ్చు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ అంగ‌న్‌వాడీలు. మున్సిప‌ల్ కార్మికులు కూడా ఆందోళ‌న‌కు దిగిన‌ప్ప‌టికీ వారి స‌మ‌స్య‌లను ఏపీ ప్ర‌భుత్వం త్వ‌ర‌గా ప‌రిష్క‌రించింది.

ఈ నేప‌థ్యంలో ఏపీలో బీసీల త‌ర్వాత అత్య‌ధిక ఓటు బ్యాంక్ క‌లిగిన కాపులు మాత్రం ఊరికే ఎందుకుంటారు? మౌనంగా ఉండే ప్ర‌శ్నే లేదంటున్నారు. జ‌న‌సేన‌ను త‌మ పార్టీగా మెజార్టీ కాపులు భావిస్తున్నారు. టీడీపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం, త‌మ డియాండ్ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి ఇంత‌కంటే మంచి త‌రుణం రాద‌ని ఆ సామాజిక వ‌ర్గంలోని కొంత మంది న‌మ్ముతున్నారు.

టీడీపీతో పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 50 అసెంబ్లీ, ఐదు లోక్‌స‌భ స్థానాలు, అలాగే రెండు లేదా రెండున్న‌రేళ్ల పాటు ప‌వ‌న్‌కు సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌నే ఎజెండాతో కాపులంతా జ‌న‌సేన కాపులు ఐక్యం అవుతున్నారు. త‌మ డిమాండ్ల‌కు త‌లొగ్గి చంద్ర‌బాబు అధికారంలో భాగ‌స్వామ్యం, అలాగే 50 అసెంబ్లీ సీట్ల‌కు త‌క్కువ కాకుండా కేటాయిస్తేనే కాపుల ఓట్లు టీడీపీకి బ‌దిలీ అవుతాయ‌ని వారు చెబుతున్నారు.

ఒక‌వేళ అధికారంలో భాగం ఇవ్వ‌క‌పోవ‌డం, అలాగే సీట్ల‌లో భారీ కోత విధిస్తే, గ‌తంలో మాదిరిగానే చంద్ర‌బాబును ఓడిస్తామ‌ని కాపులు హెచ్చ‌రిస్తున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో నిర్వ‌హించే కాపుల స‌మావేశానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ హాజ‌ర‌వుతార‌ని, త‌మ డిమాండ్ల‌ను ఆయ‌న దృష్టికి కూడా తీసుకెళ్తామ‌ని వారు చెబుతున్నారు. త‌మ‌ను గౌర‌వించేలా సీట్ల కేటాయింపు, అలాగే అధికారంలో భాగం ఇస్తే ఏ గొడ‌వా వుండ‌ద‌ని, కాదు, కూడ‌దంటే మాత్రం టీడీపీ త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని కాపులు హెచ్చ‌రిస్తున్నారు. జ‌న‌సేన కాపుల వార్నింగ్ టీడీపీలో ఆందోళ‌న రేకెత్తిస్తోంది.