మమ్మల్ని చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను తిట్టమన్నారు .. మేం తిట్టలేదు, అందుకే మాకు టికెట్లు కేటాయించలేదు అని వారు చెబితే చెప్పారు కానీ, అలాంటి మాటలను అచ్చొత్తి ఈనాడు పత్రిక జగన్ పార్టీలో టికెట్లు దక్కని వారి మాటలను పతాక శీర్షికలేసుకుని అనందించడమే పెద్ద విడ్డూరం! జగన్ వారిని తిట్టమన్నారట, వారు తిట్టలేదట, అందుకే టికెట్ ఇవ్వను పో అన్నాడట! ఆహా.. ఏం స్టోరీలబ్బా! ఇంకా 90లల్లోనే మిగిలిపోయినట్టుగా ఉన్నారు పాపం!
మరి జగన్ తన అభ్యర్థుల ధనబలం చూసి ఇస్తున్నాడు, వందల కోట్లు పెట్టేవాళ్లకే టికెట్లు ఇస్తున్నాడంటూ కూడా రేపోమాపో రాళ్లు వేయనూ వేయొచ్చు! ఈ ప్రచారానికి ఎప్పుడో తెరతీశారు! ఎన్నికల ఖర్చుకు జగన్ డబ్బులు చూపమంటున్నాడని, డిపాజిట్లు చేయమంటున్నాడంటూ కూడా ప్రచారానికి తెరతీశారు! యూట్యూబ్ చానళ్ల ద్వారా ఇలాంటి ప్రోపగండాను ఎప్పుడో షురూ చేశారు, ఎంపీ అభ్యర్థిత్వానికి అయితే ఇంత, ఎమ్మెల్యే టికెట్ కు అయితే ఇంత డబ్బులు చూపాలని జగన్ కోరుతున్నాడంటూ నెలల నుంచినే దంచుతున్నారు!
మరి ఈ పచ్చ ప్రచారాల సంగతలా ఉంటే.. జగన్ అభ్యర్థులేంటి, వారి నేపథ్యం ఏమిటి? ఏంటి? అంతే సాధారణంగా ఉంది! జగన్ లేటెస్ట్ జాబితాలోని శింగనమల, మడకశిర అభ్యర్థుల నేపథ్యం అయితే షాకింగ్ గానే ఉంది. మడకశిరకు ఎవరో జగన్ ఒక మాజీ పెద్ద ఉద్యోగిని తీసుకొస్తాడని, అతడు కోట్లతో దిగుతాడంటూ ఒక ప్రచారాన్ని మొదట్లోనే చేశారు. అయితే అక్కడ అభ్యర్థి ఒక సాధారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త! సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి వ్యక్తి! పార్టీ పట్ల నిబద్ధతో పని చేసే వ్యక్తి!
ఇక శింగనమల విషయంలోనూ అదే ముచ్చట! ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో మాజీ ఐఏఎస్ లనో, ఐపీఎస్ లను, కోట్లను కుప్పేసిన దళితులనో రంగంలోకి దించడం ఏపీ రాజకీయంలో చంద్రబాబు మొదలుపెట్టిన రాజకీయం! అదే ఇన్నాళ్లూ కొనసాగింది. అయితే ఇప్పుడు అనంతపురం వంటి జిల్లాలో శింగనమల, మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ నుంచి అభ్యర్థులను జగన్ ఎంపిక చేయడం విశేషం. కేవలం అనంతపురం జిల్లాలోనే కాదు, కర్నూలు జిల్లా రిజర్వ్డ్ నియోజకవర్గాల విషయంలో కూడా జగన్ ఈ కొత్త ఎంపికలతో ఆశ్చర్యపరుస్తున్నాడు!
ఎమ్మెల్యే అభ్యర్థిత్వం అంటే పదుల కోట్లు, వందల కోట్లు అనే వార్తలు నిత్యకృత్యం అయిన సమయంలో.. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో జగన్ నిలబెడుతున్న సాధారణ నేపథ్యపు అభ్యర్థులు సంచలనం అనే చెప్పాలి!