వైసీపీలో అభ్యర్థుల ఎంపిక కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలిగిస్తోంది. టికెట్లు దక్కని సిటింగ్‌లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. టికెట్లు దక్కించుకున్న నేతలు సంతోషంగా ఉన్నారు. అయితే కొంత మంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించడానికి సీఎం జగన్ మార్పుచేర్పులు చేశారు, ఇంకా చేస్తారు. ఈ మార్పులు కొందరు ప్రజాప్రతినిధులకు రుచించడం లేదు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు లోక్‌సభకు పోటీ చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. ఈయన్ను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. అయితే ఆయన మాత్రం మరోసారి ఆలూరు ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి ఇష్టపడుతున్నారు. అలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విరూపాక్షిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది.
ఇటీవల ఆలూరులో తన అనుచరులతో మంత్రి గుమ్మనూరు జయరాం సమావేశమయ్యారు. తనకు ఎంపీ టికెట్ ఇచ్చారని, అయితే కార్యకర్తల అభీష్టం మేరకే తన పోటీ వుంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటే అదే పని చేస్తానని ఆయన బహిరంగంగానే స్పష్టం చేశారు.
గుమ్మనూరు జయరాం వైఖరి వైసీపీ అధిష్టానాన్ని ధిక్కరించినట్టుగా వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలాగైతే అందరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని తిరుగుబాటు బావుటా ఎగురవేయరా అనే చర్చకు తెరలేచింది.
ఇదిలా వుండగా ఆలూరు వైసీపీ అభ్యర్థి విరూపాక్షి తనకు సహకరించాలని కోరేందుకు జయరాంను కలవాలని అనుకుంటున్నారు. అయితే జయరాం అందుబాటులో లేరని అంటున్నారు. ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జయరాం ఆచూకీ విషయమై చర్చ నడుస్తోంది. ఆయన్ను ఎలాగైనా కలవాలని విరూపాక్షి అనుకుంటుంటే, ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. మంత్రి గారూ…ఒక్క సారి మీ దర్శన భాగ్యం కల్పించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.