తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సత్యవేడు ఎమ్మెల్యే. అయితే ఆయన్ను తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. సత్యవేడును విడిచి ఎక్కడికీ వెళ్లనని ఆదిమూలం భీష్మించారు.
ఎంపీ బరిలో నిలబడడం ఆదిమూలానికి ఏ మాత్రం ఇష్టం లేదు. అనారోగ్య కారణాలు చూపుతూ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తాను తిరగలేనని సీఎం జగన్ మొదలుకుని, వైసీపీ పెద్దలందరికీ ఆదిమూలం మొరపెట్టుకున్నారు. కానీ సత్యవేడులో వ్యతిరేకత వుందని, ఓడిపోతావంటూ తిరుపతి ఎంపీ సీటు ఖరారు చేశారు.
వైసీపీ అధిష్టానం నిర్ణయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన అయిష్టంగా ఉన్నారు. ఎలాగైనా సత్యవేడు నుంచే పోటీ చేయాలని తన ప్రయత్నాల్ని ఆయన కొనసాగుతున్నారు. మరోవైపు తిరుపతి ఎంపీ సీటు నుంచి మార్చకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఆయన అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో విజయవాడలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సత్యవేడు నుంచి కార్యకర్తలు వెళ్లకుండా ఆయన అడ్డుకున్నారని తెలిసింది. వైసీపీ నుంచి సానుకూల స్పందన రాకపోతే మాత్రం పార్టీ వీడి, టీడీపీలో చేరేందుకు ఆయన సమాయత్తం అవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సత్యవేడులో వైసీపీని ఓడించేందుకు టీడీపీలో చేరి ప్రచారం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారని తెలిసింది.