వైఎస్సార్ జిల్లా పర్యటనలో చంద్రబాబునాయుడు పులివెందులపై జోక్ చేశారు. కమలాపురంలో నిర్వహించిన రా…కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఈ దఫా పులివెందుల్లో కూడా టీడీపీ గెలుస్తుందని ఆర్భాటంగా ప్రకటించారు. టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేందుకు ఆయన ఈ మాట అని వుండొచ్చు. కానీ చంద్రబాబు పులివెందులపై చేసిన కామెంట్స్ వైసీపీ నేతలు, కార్యకర్తల్లో పట్టుదల పెంచాయి.
ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు మరింత పకడ్బందీ వ్యూహాన్ని రచించే అవకాశం వుంది. కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి నేతృత్వంలోనే కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించారు. సార్వత్రిక ఎన్నికల్లో సైతం అవే ఫలితాల్ని సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారు.
కుప్పంలోనే చంద్రబాబును కట్టడి చేస్తే, మిగిలిన చోట్ల టీడీపీని నైతికంగా దెబ్బ కొట్టొచ్చనేది వైసీపీ ఎత్తుగడ. అందులో భాగంగానే వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. అయితే ఎక్కడా ప్రచారం లేకుండా అధికార పార్టీ నేతలు కుప్పంలో పని చేసుకెళుతున్నారు. తనను ఓడించడానికి పక్కా ప్రణాళికతో మంత్రి పెద్దిరెడ్డి ముందుకెళుతున్నారని తెలిసే, రెండు, మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు తన నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు.
కుప్పానికి వెళ్లినప్పుడల్లా కనీసం రెండు మూడు రోజులు అక్కడే తిష్ట వేసి టీడీపీ శ్రేణులతో మాట్లాడుతున్నారు. వారిలో అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పోల్ మేనేజ్‌మెంట్ ఈ దఫా టీడీపీకి సవాలే. ఎన్నికలప్పుడు కుప్పంలో వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందోననే ఉత్కంఠ టీడీపీలో వుంది.