వేటగాడు మెత్తనైతే లేడి మూడు కాళ్ల మీద పరుగెడుతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిస్థితి అలాగే వుంది ఇప్పుడు. ఎలాగైనా అధికారం సంపాదించాల్సిందే. వారసత్వం కొడుకుకు అందించాల్సిందే అని తెగ కష్టపడుతున్నారు.
ఈ కష్టంలో భాగంగా ఏ ఒక్కరినీ వదలడం లేదు. ఏ ఒక్క అవకాశం వదలడం లేదు. ఎవర్ని పడితే వారిని లోపలకు తీసుకుంటున్నారు. ఎవర్ని పడితే వారిని సాయం కోరుతున్నారు. కానీ ఈ సాయమే సమస్యలు తెస్తోందని తెలుస్తోంది. అందుకే ఒక పట్టాన టికెట్లు ఫైనల్ చేయలేకపోతున్నారు.
ఈసారి టికెట్లు సీనియర్లకు ఆచి తూచి ఇవ్వాలని, తప్పనిసరి అయితే తప్ప వారసులకు కూడా ఇవ్వకూడదు అన్నది చంద్రబాబు, లోకేష్ ఆలోచన. జగన్ టికెట్లు ఇవ్వడం చూసి, సరైన కౌంటర్ అభ్యర్ధులను ఎంపిక చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికే జనసేన రూపంలో ప్రెజర్ వుండనే వుంది. నలభై యాభై సీట్లు కావాలనే పట్టుదల వుండనే వుంది.
ఇది చాలక ఇప్పుడు ఓ మీడియా సంస్థ అధినేత తనకు కొన్ని సీట్లు కోటా కింద ఇవ్వాలని ఇండైరెక్ట్‌గా కోరుతున్నారని తెలుస్తోంది. అయితే నేరుగా టికెట్లు అడగకుండా, కొన్ని ప్లేస్‌ల పేర్లు చెప్పి, తనకు చెప్పకుండా ఆ ప్లేస్ ల్లో టికెట్ లు ఫైనల్ చేయవద్దని కోరినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గమ్మత్తేమిటంటే ఆ ప్లేస్ లు అన్నీ సీనియర్లు, గెలిస్తే మంత్రి పదవులు వస్తాయి అనే నమ్మకం వున్న వారి సీట్లు కావడం విశేషం.
అంటే ఈ సీట్ల విషయంలో సదరు మీడియా అధినేత ఆసక్తి ఏమిటి? అన్నది ప్రశ్నార్ధకం. ఈ సీనియర్లు తమ సీటు డౌట్ అన్న ఆలోచనతో ఆ మీడియా అధినేత అండ కోరారా? లేక ఎలాగూ మారుస్తారు అని తెలిసి, ఆ సీట్లలో తన మనుషులను పెట్టాలని ఆయన అనుకుంటున్నారా?
మొత్తానికి ఇలా అందరికీ తలా కొన్ని సీట్లు మొహమాట పడితే బాబుగారు సీట్లు ప్రకటించడం చాలా ఆలస్యం అయిపోతుంది. ఈ విషయంలో ఏమయితే అయిందని జగన్ దూకుడుగా ముందుకు వెళ్లిపోతున్నారు. ఆ తరువాత వచ్చే పరిణామాలు వస్తున్నాయి. పార్టీ మారే వారు మారుతున్నారు. ఎన్నికల వేళకు అంతా సర్దుకుంటుంది.
కానీ బాబుగారు ఎన్నికల ముందు వరకు టికెట్లు ఇవ్వకపోతే, అప్పటికప్పుడు వచ్చే గడబిడలు సర్దుబాటు చేసుకోవడం అంత సులువు కాదు.