వైసీపీలో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు చేరనున్నారని తెలిసింది. ఈ మేరకు ఆయనతో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చర్చలు జరిపారు. రావెల కిషోర్‌బాబు చేరిక పార్టీకి రాజకీయంగా ప్రయోజనమని భావించి చేర్చుకుంటున్నట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు.
రావెల ప్రభుత్వ ఉద్యోగిగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం వుంది. అలాగే 2014లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి ఆయన టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితపై గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కేబినెట్ నుంచి ఆయనకు ఉద్వాసన పలికారు. దీంతో ఆయన టీడీపీని వీడారు.
అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగలేదు. బీజేపీని వీడి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్లో చేరారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఉనికే లేని బీఆర్ఎస్లో రావెల ఎందుకు చేరారో, ఆ తర్వాత ఎందుకు వీడారో తెలియని పరిస్థితి.
ఎన్నికల ముంగిట ఆయన్ను వైసీపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకులు చర్చలు జరపడం విశేషం. ఇప్పటికే రావెలతో వైసీపీ పెద్దలు చర్చలు ముగిశాయి. త్వరలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నట్టు వైసీపీ వర్గాలు తెలిపాయి.