వివాదంపై ఎట్టకేలకు స్పందించిన నయనతార

నయనతార లీడ్ రోల్ పోషించిన అన్నపూరణి సినిమా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా ఇందులో సన్నివేశాలున్నాయంటూ కేసు నమోదైంది. దీంతో నిర్మాణ సంస్థ జీ గ్రూప్ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.…

నయనతార లీడ్ రోల్ పోషించిన అన్నపూరణి సినిమా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా ఇందులో సన్నివేశాలున్నాయంటూ కేసు నమోదైంది. దీంతో నిర్మాణ సంస్థ జీ గ్రూప్ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఈ అంశంపై స్పందించింది. తమ ఓటీటీ వేదిక నుంచి అన్నపూరణి సినిమాను తొలిగించింది.

ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై నయనతార స్పందించింది. మనోభావాలు దెబ్బతీసి ఉంటే క్షమించమని వేడుకుంది. తాము కావాలని తప్పు చేయలేదని తెలిపింది.

“గత కొన్ని రోజులుగా నా సినిమా 'అన్నపూరణి' చర్చనీయాంశంగా మారిన విషయంపై బరువెక్కిన హృదయంతో, ఈ ప్రకటన చేస్తున్నాను. 'అన్నపూరణి' చిత్రాన్ని కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే కాకుండా ప్రజల్లోకి మంచి ఆలోచనను తీసుకురావాలనే ప్రయత్నంగా చేశాం.. దృఢసంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చని చూపించేందుకు 'అన్నపూర్ణి' చిత్రాన్ని రూపొందించాం. మీ మనోభావాలను ఏ విధంగానైనా గాయపరిచి ఉంటే క్షమించండి. అన్నపూర్ణి సినిమా అసలు ఉద్దేశం ఎవరి మనోభావాలు దెబ్బతీయడం కాదు.”

తమకు తెలియకుండానే కొందరి మనసుల్ని గాయపరిచామనే విషయాన్ని నయనతార అంగీకరించింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా వివాదాస్పదమవ్వడం బాధాకరమన్న నయనతార.. అన్ని మతాల్ని సమానంగా చూస్తూ, అన్ని ప్రార్థనా స్థలాల్ని సందర్శించే తను ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పని చేయలేదని చెప్పుకొచ్చింది.

అన్నపూరణి సినిమాలో బ్రాహ్మణ యువతిగా నటించింది నయనతార. ఓ సనాతన కుటుంబానికి చెందిన యువతి, చెఫ్ గా ఎలా ఎదిగిందనేది ఇందులో చూపించారు. అయితే బిర్యానీ చేస్తున్నప్పుడు ఓ బ్రాహ్మణ యువతి నమాజ్ చేయడం, నాన్-వెజ్ తినడం లాంటివి తీవ్ర అభ్యంతరాలకు దారితీశాయి.